Begin typing your search above and press return to search.

మారుతీకి 2 హిట్స్ కావాలి

By:  Tupaki Desk   |   22 July 2018 7:27 AM GMT
మారుతీకి 2 హిట్స్ కావాలి
X
ఒకవైపు తాను దర్శకత్వం వహించే సినిమాలతో పాటు తన నిర్మాణంలో చిన్న స్థాయి ప్రాజెక్ట్స్ తో తన బ్యానర్ ని బిజీగా చూసుకునే దర్శకుడు మారుతి నుంచి వచ్చే నెలలో రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇవి ఇతర దర్శకులతో చేసినవి. బ్రాండ్ బాబు టీజర్ ఇటీవలే విడుదలై సం థింగ్ ఉందనే ఇంప్రెషన్ కలిగించింది. భలే మంచి చౌక బేరము టీజర్ నెలక్రితమే విడుదల చేసినప్పటికీ దానికి సంబంధించిన అప్ డేట్స్ మాత్రం తర్వాత ఇవ్వలేదు. తాజాగా ఈ రెండూ రిలీజ్ కు సిద్ధమయ్యాయి. డేట్స్ ఫిక్స్ చేయనప్పటికీ తక్కువ గ్యాప్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రాండ్ బాబు టీవీ నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందింది. తన మొదటి సినిమా నెక్స్ట్ నువ్వే ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ అతని టేకింగ్ మీద నమ్మకంతో బ్రాండ్ బాబు ఆఫర్ ఇచ్చాడు మారుతీ. ఒక ధనవంతుడికి పనిమనిషికి మధ్య జరిగే ప్రేమకథను ఇందులో చూపించబోతున్నారు.

ఇక మురళి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన డార్క్ కామెడీ భలేమంచి చౌక బేరము థీమ్ కూడా ఆసక్తికరంగానే ఉంది. శత్రుదేశానికి చెందిన అతి రహస్యమైన సమాచారాన్ని డబ్బు రూపంలో మార్చుకోవాలన్న ఇద్దరు హీరోల కాన్సెప్ట్ తో బాలీవుడ్ తరహా టేకింగ్ లో దీన్ని కొత్తగా తీసే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోంది. మారుతీ నిర్మించిన ఈ రెండూ సినిమాలు బడ్జెట్ పరిమితుల్లో రిస్క్ లేకుండా సేఫ్ అయ్యేలా తీసినవి. కానీ హిట్ అయితేనే గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ కి పేరు వస్తుంది. మారుతి టార్గెట్ కూడా అదే. మరో పక్క తాను దర్శకత్వం వహిస్తున్న శైలజారెడ్డి అల్లుడు ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇంకా ఖరారు చేయలేదు కానీ అన్ని కుదిరితే ఇది కూడా ఆగస్ట్ లోనే ఉండొచ్చు. మరి మారుతీకి ప్రేమ కథా చిత్రం తరహాలో తాను నిర్మించిన రెండు సినిమాలు హిట్ అవుతాయో లేక రోజులు మారాయి మాదిరి ట్విస్ట్ ఇస్తాయో విడుదల అయ్యాక చూడాలి.