Begin typing your search above and press return to search.

‘చూడాలని ఉంది’కి 2.5 లక్షలు.. ‘ఇంద్ర’కు కోటి

By:  Tupaki Desk   |   21 Jun 2018 1:30 AM GMT
‘చూడాలని ఉంది’కి 2.5 లక్షలు.. ‘ఇంద్ర’కు కోటి
X
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. ఒక సమయంలో అగ్ర హీరోలందరూ మణిశర్మనే ప్రిఫర్ చేసేవాళ్లు. ఏడాదికి పదికి తక్కువ కాకుండా భారీ సినిమాలు చేసేవాడు మణి. సంగీత దర్శకుడిగా అవకాశాలు అందుకోవడం కొంచెం ఆలస్యమైంది కానీ.. ఒక్కసారి ఛాన్స్ దక్కించుకున్నాక మణిశర్మ వెనుదిరిగి చూడలేదు. హీరోలతో సమానంగా భారీ పారితోషకాలు తీసుకున్న ఘనత మణిశర్మదే. ఆ సమయంలో తన హవా ఎలా సాగిందో ఒక ఇంటర్వ్యూలో మణిశర్మే స్వయంగా చెప్పాడు.

తెలుగులో తాను కమిటైన తొలి సినిమా ‘చూడాలని ఉంది’కి తాను తీసుకున్న పారితోషకం రూ.2.5 లక్షలు మాత్రమే అని మణిశర్మ వెల్లడించాడు. ఈ చిత్రంలో తనకు అవకాశమిచ్చిన అశ్వినీదత్ దేవుడని.. ఆయనకు తాను పాదాభివందనం చేయాలని మణిశర్మ తెలిపాడు. అదే నిర్మాత తీసిన ‘ఇంద్ర’ సినిమాకు తాను కోటి రూపాయల పారితోషకం తీసుకున్నట్లు మణి వెల్లడించాడు. తర్వాత ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలిపాడు. సంగీత దర్శకులకు విలువ వచ్చేలా చేసి వారికి మంచి పారితోషకాలు దక్కేలా చేయడంలో తన పాత్ర ఉందన్నాడు. తన శిష్యులు ఆ ఒరవడిని కొనసాగిస్తున్నారన్నారు. ఐతే తాను సంగీత దర్శకుడిగా మారడానికంటే ముందు మంచి డిమాండ్లో ఉండేవాడినని.. కీబోర్డ్ ప్లేయర్‌ గా తన కాల్ షీట్ ఒకటి రూ.10 వేలు ఉండేదని.. 90ల మొదట్లోనే ఒక పాటకు రూ.70 వేలు తీసుకున్న స్థాయి తనదని.. ఇండియా మొత్తంలో అప్పటికి ఎవరూ అంత పారితోషకం తీసుకోలేదని మణిశర్మ చెప్పాడు. బాలీవుడ్లో అను మాలిక్ లాంటి వాళ్లు తన రేంజ్ చూసి ఆశ్చర్యపోయేవాళ్లని ఆయనన్నాడు.