Begin typing your search above and press return to search.

మణిరత్నం సినిమా.. కొత్త సంగతులు

By:  Tupaki Desk   |   29 Aug 2015 5:30 PM GMT
మణిరత్నం సినిమా.. కొత్త సంగతులు
X
విలన్, కడలి లాంటి డిజాస్టర్ల తర్వాత ‘ఓకే బంగారం’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు మణిరత్నం. ఐతే ఈ సక్సెస్ నిలబెట్టుకోవడానికి మళ్లీ ఆచితూచి అడుగేస్తున్నాడు మణి. కార్తి, దుల్కర్ సల్మాన్ ల కలయికలో ఆయనో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే లైన్ ఓకే అయింది కానీ.. ఇంకా పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం కాలేదు. ఇప్పుడా పనిలోనే ఉన్నాడు మణి. స్క్రిప్టు పక్కాగా రెడీ కావడానికి, ప్రి ప్రొడక్షన్ కి ఇంకో నాలుగు నెలల టైం పడుతుందట. జనవరిలో కానీ ఈ సినిమా మొదలవదని సమాచారం. కోలీవుడ్ లో తొలి అడుగులు వేస్తున్న కీర్తి సురేష్ ను ఓ హీరోయిన్ గా ఎంచుకున్న మణి.. మరో హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నాడు. ఎప్పట్లాగే మణి ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తున్నాడు.

మణి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఓ రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. ఐతే అంతిమంగా ప్రతీకారం దేనికీ పరిష్కారం కాదు అని చెబుతాడట. ఇంతకుముందు తన దర్శకత్వంలోనే వచ్చిన అగ్నినక్షత్రం (తెలుగులో ఘర్షణ) తరహాలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. తన సినిమాల్నే మోడర్నైజ్ చేసి సినిమాలు తీయడం మణికి కొత్తేమీ కాదు. సఖి స్ఫూర్తితో ఓకే బంగారం సినిమాను అలాగే తీశాడు. తన కొత్త సినిమా విషయంలోనూ అదే ఒరవడి కొనసాగించబోతున్నాడు మణి. అగ్నినక్షత్రం సినిమాను మోడర్నైజ్ చేయబోతున్నాడు. కార్తి, దుల్కర్ లాంటి మంచి నటుల్ని ఎంచుకోవడంతో ఆయన పని తేలికైపోతుంది. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఓకే బంగారం తరహాలోనే తన అభిమానుల్ని మణి మరోసారి మురిపిస్తాడేమో చూద్దాం.