కర్ణాటక సీన్.. మంచు విష్ణు సినిమాలా ఉందట

Thu May 17 2018 13:59:35 GMT+0530 (IST)

గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాల గురించే చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య మలుపులు తిరిగిన పరిణామాలపై రాష్ట్రాలు.. ప్రాంతాలు అని తేడా లేకుండా అందరూ చర్చించుకుంటున్నారు. ఫిలిం సెలబ్రెటీలు సైతం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా మంచు విష్ణు అక్కడి పరిణామాలపై ఆసక్తికర రీతిలో స్పందించాడు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తన కొత్త సినిమా ‘ఓటర్’ను తలపించేలా ఉన్నాయని విష్ణు చెప్పడం విశేషం. ఈ రోజు ట్విట్టర్లో విష్ణు స్పందిస్తూ.. ‘‘వాట్ ఎ ట్విస్ట్ సర్ జీ.. కర్ణాటక తీర్పు ఇంచుమించు నేను నటిస్తున్న ‘ఓటర్’ సినిమాలాగే ఉంది’’ అని ట్వీట్ చేశాడు.విష్ణు ఇలా చెప్పడంతో సినిమాలో ఏం ట్విస్టులున్నాయో అన్న ఆసక్తి కలిగింది జనాల్లో.  తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘ఓటర్’ సమకాలీన రాజకీయాలపై సెటైర్ తరహాలో ఉంటుందని అంటున్నారు. ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. గత ఏడాది మంచు విష్ణు ఓటు వేసిన వేలిని చూపిస్తున్న ఫస్ట్ లుక్ ఆసక్తి రేకెత్తించింది. కానీ తర్వాత ఈ చిత్రం వార్తల్లో లేకుండా పోయింది. ఐతే ప్రస్తుత కర్ణాటక పరిణామాల నేపథ్యాన్ని తన సినిమాకు ముడిపెట్టి ట్వీట్ చేయడం ద్వారా మళ్లీ జనాల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లడానికి విష్ణు ప్రయత్నిస్తున్నట్లున్నాడు. విష్ణు ఈ చిత్రంతోనే తొలిసారి తమిళంలోకి వెళ్తున్నాడు. అక్డక ఈ చిత్రం ‘కురల్ 388’ పేరుతో విడుదల కాబోతోంది. ఎన్నికల తర్వాత ఓటరు రాజకీయ నాయకులపై తిరగబడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారట. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నాడు.