Begin typing your search above and press return to search.

మంచు విష్ణు.. హాలీవుడ్డోళ్ల తో ఎందుకంటే?

By:  Tupaki Desk   |   3 Sep 2015 2:14 PM GMT
మంచు విష్ణు.. హాలీవుడ్డోళ్ల తో ఎందుకంటే?
X
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటుంటాడు మంచు విష్ణు. ఇందుకోసం తరచుగా హాలీవుడ్ వాళ్లను కలుస్తుంటాడు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో చేయబోతున్న ‘కన్నప్ప’తో పాటు.. హనుమంతుడి జీవిత కథతో తెరకెక్కబోయే ‘హనుమాన్’ సినిమాకు హాలీవుడ్ నిపుణులతో కలిసి పని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు విష్ణు. ఐతే ఇక్కడ ఇంతమంది నిపుణులుండగా.. హాలీవుడ్ వాళ్ల సహకారమెందుకు అని విష్ణును అడిగితే.. బడ్జెట్ తగ్గించి, క్వాలిటీ పెంచడానికే అని చెప్పాడు విష్ణు. అయినా హాలీవుడ్ చేయి పడితే ఖర్చు పెరుగుతుంది తప్ప.. ఎందుకు తగ్గుతుంది అంటే.. విష్ణు చెబుతున్న లాజిక్ ఏంటో చూడండి.

"హాలీవుడ్ సినిమాలంటే మనం అతిగా ఊహించుకుంటాం. కింగ్ కాంగ్ సినిమాను వాళ్లు కేవలం 60 రోజుల్లో తీశారంటే నమ్మగలరా? అదొక్కటే కాదు.. మనం క్లాసిక్స్ అని చెప్పుకుంటున్న చాలా సినిమాల్ని వాళ్లు చాలా తక్కువ రోజుల్లో తీశారు. ప్రి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకోవడం ద్వారా ఖర్చు బాగా తగ్గిస్తారు. మనం ఏళ్ల తరబడి సినిమాలు తీస్తాం. వాళ్ల ప్లానింగ్ నాకు చాలా ఇష్టం. కన్నప్ప సినిమా సంగతే తీసుకుంటే.. దాన్ని మేం అనుకున్నట్లు తెరకెక్కించాలంటే రూ.100 కోట్లు కావాలి. నా దగ్గర అంత బడ్జెట్ లేదు. అందులో సగం బడ్జెట్ కి రెట్టింపు నాణ్యత కనిపించాలంటే హాలీవుడ్ వాళ్ల సహకారం అవసరం. కన్నప్ప ఓ ధీశాలి. భరణి గారు రాసుకున్న స్క్రిప్టులో యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యముంది. అందుకే అత్యున్నత ప్రమాణాలతో సినిమా తీయాలనుకుంటున్నాం. హాలీవుడ్ వాళ్ల సహకారం తీసుకుంటున్నాం. బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఆ సినిమా స్ఫూర్తితో అలాంటి సినిమాలు మరిన్ని రావాలి. మనమూ అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకోవాలి" అని చెప్పాడు విష్ణు.