Begin typing your search above and press return to search.

తండ్రి సొమ్ము తింటున్నావని మనోజ్‌‌ ను అంటే..

By:  Tupaki Desk   |   26 Sep 2018 4:32 AM GMT
తండ్రి సొమ్ము తింటున్నావని మనోజ్‌‌ ను అంటే..
X
మంచు మనోజ్ సిినీ కెరీర్‌ కు చాన్నాళ్ల కిందటే బ్రేక్ పడింది. దాదాపు ఏడాది నుంచి అతను సినిమా షూటింగులకు వెళ్లట్లేదు. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అతను సినిమానే మొదలుపెట్టలేదు. కొంత కాలం సోషల్ మీడియాకు కూడా అతను దూరంగా ఉన్నాడు. ఐతే కొన్ని నెలలుగా అతను స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేస్తూ.. సోషల్ మీడియాలో సినిమాలతో పాటు వివిధ అంశాలపై స్పందిస్తూ యాక్టివ్‌ గా ఉంటున్నాడు. ఐతే సోషల్ మీడియా అన్నాక నెగెటివిటీ చాలానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులోనూ మంచు కుటుంబానికి ఇది మరీ ఎక్కువ. కొందరు తీవ్ర స్థాయిలో దూషణలకు దిగుతుంటారు. కొందరు పాయింట్లు పట్టుకుని విమర్శలు గుప్పిస్తుంటారు.

తాజాగా ఒక నెటిజన్ మంచు మనోజ్‌ ను ఇలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. తండ్రి సంపాదించిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ అందరికీ బాగానే ఆదర్శంగా నిలుస్తున్నావ్ అంటూ మనోజ్‌ కు కౌంటర్ వేశాడు. దీనికి మనోజ్ వెంటనే స్పందించాడు. తాను నిజంగా తన తండ్రి సొమ్మును ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉండేదని.. కానీ తాను ఎప్పుడూ ఆ పని చేయలేదని అన్నాడు. తాను బతకడం కోసం హోటల్లో సర్వర్‌ గా కూడా పని చేశానని.. సినిమాల్లో కూడా తనకు తానుగా ప్రయత్నాలు చేసుకుని అవకాశాలు దక్కించుకున్నానని.. కథల ఎంపిక దగ్గర్నుంచి అన్నీ తనే చూసుకున్నానని.. అంతే తప్ప తండ్రి మీద ఆధారపడలేదని మనోజ్ స్పష్టం చేశాడు. మరోవైపు మిర్యాడగూడలో పరువు హత్యకు సంబంధించిన చర్చలో తన కుటుంబ సభ్యుల పేర్లు తీసుకురావడం మీద కూడా మనోజ్ ఘాటుగా స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మీ ఇంట్లోనూ మహిళలున్నారు చూస్కోండి అని హెచ్చరించాడు.