పవన్ చెప్పినవన్నీ నిజమే అంటున్న మనోజ్

Tue Apr 24 2018 13:37:30 GMT+0530 (IST)

మెగా ఫ్యామిలీకి.. మంచు కుటుంబానికి మధ్య ఏదో ఉందని పలువురు అంటూ ఉంటారు.. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు. చిరంజీవి- మోహన్ బాబుల మధ్య కొన్ని మార్లు ఈవెంట్లలో జరిగిన సంభాషణలు ఇందుకు మద్దతుగా కనిపిస్తాయి. అయితే.. ఇదంతా ఒకప్పటి వ్యవహారం.. పైగా పర్సనల్ సంగతులు.తెలుగు సినీ పరిశ్రమ దగ్గరకు వచ్చేసరికి.. తామంతా ఒకటే అనే తరహాగా మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికాడు. తనను తన కుటుంబాన్ని మానసికంగా అత్యాచారం చేసే కార్యక్రమాన్ని ఆరు నెలలుగా ప్లాన్ చేసి నడిపిస్తున్నారంటూ.. పలు ఛానళ్ల పైనా.. అధికార టీడీపీ పైనా ఆరోపణలు చేశాడు పవన్ కళ్యాణ్. ఈ ఛానల్స్ పై చర్యలు చేపట్టాలని పరిశ్రమ వర్గాలను కూడా సూచించాడు. దీనికి ఇండస్ట్రీ జనాల రియాక్షన్ ఏంటనే సంగతి ఇంకా తెలియలేదు. అయితే.. ఇప్పుడు అనూహ్య స్థాయిలో మంచు మనోజ్.. తాను పవన్ కు పూర్తి మద్దతు పలుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ ఎపిసోడ్ లో ఎవరెవరు ఉన్నారో.. ఛానల్స్ ఎండీలు-సీఈఓలు- పార్టీ నేతల పాత్ర ఏంటో తనకు తెలుసని చెప్పిన మంచు మనోజ్.. ఈ విషయంపై తాను స్పందించకుండా ఉండలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఒకరకంగా ఇప్పటివరకూ పవన్ ఏవేవో ఊహించేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని కొందరు అనుకుంటున్నారు కానీ.. మంచు మనోజ్ రాసిన బహిరంగ లేఖలో మాత్రం.. ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది.