పుకార్లకు ఫుల్ క్లారిటీ ఇచ్చిన మనోజ్

Mon Oct 22 2018 17:45:18 GMT+0530 (IST)

మంచు మనోజ్ తాను హైదరాబాద్ నుండి తిరుపతికి మకాం మార్చబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో పలువురు పలు రకాలుగా చర్చించుకోవడం ప్రారంభం అయ్యింది. మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్నాడని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో మంచు మనోజ్ వాటన్నింటిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తిరుపతి చేరుకున్న మంచు మనోజ్ అక్కడ మీడియా వారితో మాట్లాడుతూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు.మనోజ్ మాట్లాడుతూ... నేను తిరుపతి వస్తున్నాను అనగానే చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు స్వాగతం చెప్పినందుకు కృతజ్ఞతలు. చాలా మంది నేను సినిమాలకు దూరం అవుతున్నా అనుకుంటున్నారు. అది నిజం కాదు నేను మూడు నెలల్లో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాను. ఆ మూడు నెలల గ్యాప్ లో నేను తిరుపతిలో ఉండబోతున్నాను. తిరుపతిలో ఒక మంచి మంచి స్నేహితుల బృందంతో మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

మేము చేయబోతున్న కార్యక్రమాలు ఏంటీ మేం ఎలాంటి పనులు చేయబోతున్నాం అనే విషయాలను మరో 15 రోజుల్లో పెద్దల సమక్షంలో ప్రకటించబోతున్నాం. స్నేహితులందరం కలిసి చేయబోతున్న మంచి పనుల గురించి త్వరలోనే మీకు తెలియజేస్తాను. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటీ అంటే నేను రాజకీయాల్లోకి రావడం లేదు. నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాను. ఎవరి పని వారు చేసుకుందాం అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. ఉన్నట్లుండి తిరుపతికి మకాం మార్చడం వెనుక ఉద్దేశ్యం ఏంటో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాని రాజకీయాలకు తాను చాలా దూరంగా ఉండదల్చుకుంటున్నట్లుగా మాత్రం మనోజ్ ఫుల్ క్లారిటీతో చెప్పుకొచ్చాడు.