Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి ఆ సినిమాను ఎందుకు వదిలేసింది?

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:16 AM GMT
మంచు లక్ష్మి ఆ సినిమాను ఎందుకు వదిలేసింది?
X
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లక్ష్మీబాంబు’ మూడు నెలల నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వేసి.. ఆ తర్వాత సినిమాను వాయిదా వేస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఈ శుక్రవారం సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. నాలుగు రోజుల కిందట ప్రింట్ మీడియాలో రిలీజ్ డేట్ యాడ్స్ కూడా వచ్చాయి. కానీ ఏమైందో ఏమో ‘లక్ష్మీబాంబు’ ఈసారి కూడా విడుదలకు నోచుకోలేదు. సినిమా పట్ల అటు బయ్యర్లలో కానీ.. ఇటు ప్రేక్షకుల్లో కానీ పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్లే సినిమాకు ఈ కష్టాలని తెలుస్తోంది.

నిజానికి మంచు లక్ష్మి ఈ సినిమా మీద కొంచెం ఫోకస్ పెడితే విడుదలకు మార్గం సుగమం అవుతుందేమో. ఇంతకుముందు తాను కీలక పాత్రలు పోషించిన సినిమాలన్నింటికీ లక్ష్మి బాగా ప్రమోట్ చేసుకుంది. చివరగా ఆమె లీడ్ రోల్ చేసిన ‘దొంగాట’ను చాలా గట్టిగా ప్రమోట్ చేసింది లక్ష్మి. కానీ ‘లక్ష్మీబాంబు’ మీద ఆమె ఎందుకో కానీ దృష్టిపెట్టట్లేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తుండేసరికి ఆమెకు కూడా విసుగొచ్చేసిందేమో.. ఎక్కడా కూడా దీని ఊసెత్తట్లేదు. 24కు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ నిర్మాతలు ప్రకటన ఇచ్చాక కూడా మంచు లక్ష్మి కనీసం ట్విట్టర్లో కూడా ఈ సినిమా గురించి ఒక ట్వీట్ వేయలేదు. తమ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందంటే హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ వంతుగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మంచు లక్ష్మి ‘లక్ష్మీబాంబు’ విషయంలో అలా చేయట్లేదు. మరి ఈ సినిమాను ఆమె ఎందుకలా వదిలేసినట్లో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/