కృష్ణ కూతురి సినిమా..రేసు నుంచి తప్పుకుంది

Sun Jan 21 2018 16:25:57 GMT+0530 (IST)

రిపబ్లిక్ డే వీకెండ్ కోసం తెలుగులో అందరి కంటే ముందు కర్చీఫ్ వేసింది ‘మనసుకు నచ్చింది’ టీం. ఈ చిత్రంతోనే దర్శకురాలిగా మారిన కృష్ణ కూతురు మంజుల.. చడీచప్పుడు లేకుండా సినిమా మొదలుపెట్టి.. షూటింగ్ పూర్తి చేసి నేరుగా రిలీజ్ డేట్ తో మీడియా ముందుకొచ్చింది. రెండు నెలల కిందటే జనవరి 26న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ‘భాగమతి’.. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు రిపబ్లిక్ డే వీకెండ్ కు షెడ్యూల్ అయ్యాయి. ఐతే లేటుగా డేట్ ఖరారు చేసుకున్న ఈ రెండు సినిమాలు అన్న ప్రకారమే వచ్చే వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ‘మనసుకు నచ్చింది’ మాత్రం రేసు నుంచి తప్పుకుంది.పోటీ ఎక్కువ కావడం వల్లో.. సినిమాకు ఆశించినంత బజ్ రాకపోవడం వల్లో.. కారణమేదైనా కానీ.. ‘మనసుకు నచ్చింది’ వాయిదా పడిపోయింది. ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసినప్పటికీ జనవరి 26న విడుదల చేయట్లేదు. మూడు వారాలు ఆలస్యంగా.. ఫిబ్రవరి 16న తమ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందంటూ ఈ రోజు ప్రకటించింది చిత్ర బృందం. జనవరి 26ను వదిలేస్తే.. తర్వాతి రెండు వారాల్లో ఖాళీ లేదు. ఫిబ్రవరి 2న ‘టచ్ చేసి చూడు’.. ‘చలో’.. 9న ‘కిరాక్ పార్టీ’.. ‘గాయత్రి’.. ‘ఇంటలిజెంట్’.. ‘తొలి ప్రేమ’ సినిమాలు రాబోతున్నాయి. అందుకే పోటీ లేకుండా ఫిబ్రవరి మూడో వారానికి వెళ్లిపోయారు. మరి అప్పటికైనా ఇబ్బంది లేకుండా సినిమా రిలీజవుతుందేమో చూడాలి. జెమిని కిరణ్ నిర్మించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్-అమైరా దస్తుర్-త్రిధా చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.