Begin typing your search above and press return to search.

క్రియేటివ్ డైరెక్టర్ సినిమా రెడీ..

By:  Tupaki Desk   |   21 May 2016 8:30 AM GMT
క్రియేటివ్ డైరెక్టర్ సినిమా రెడీ..
X
బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండే దర్శకులకే కాదు.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే డైరెక్టర్లకు కూడా మంచి ఫాలోయింగే ఉంటుంది. వారికి అభిమానుల సంఖ్య తక్కువుంటుంది కానీ.. అభిమానంలో ఇంటెన్సిటీ ఏమీ తక్కువుండదు. అలాంటి దర్శకుడే చంద్రశేఖర్ యేలేటి. ‘ఐతే’ దగ్గర్నుంచి.. చివరగా తీసిన ‘సాహసం’ వరకూ తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించిన యేలేటి మీద ఓ వర్గం ప్రేక్షకుల్లో ఎప్పుడూ భారీ అంచనాలే ఉంటాయి. అతడి సినిమా కోసం ఆ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ మూడేళ్ల విరామం తర్వాత ‘మనమంతా’ అనే సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే.

చడీచప్పుడు లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోలో పోస్టర్ ఒకటి రిలీజ్ చేయడంతో పాటు.. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశాడు నిర్మాత సాయి కొర్రపాటి. సినిమాలో ప్రధాన పాత్రధారులైన మోహన్ లాల్.. గౌతమి.. విశ్వాంత్ (కేరింత ఫేమ్).. ఇంకో అమ్మాయి ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. హాలీవుడ్లో.. బాలీవుడ్లో బాగా ఫేమస్ అయిన మల్టీ స్టోరీ ఫార్మాట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు వేర్వేరు వ్యక్తుల కథల్ని చూపించి.. ఆ నలుగురినీ ఒకచోటికి తీసుకొచ్చే కథే ‘మనమంతా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.