కేటీఆర్`తో `వైఎస్ ఆర్`...వైరల్!

Fri Jul 20 2018 17:22:26 GMT+0530 (IST)

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నేడు భేటీ అయ్యారు. ఓ కార్యక్రమానికి కేటీఆర్ ను ఆహ్వానించేందుకు కేటీఆర్ క్యాంప్ కార్యాలయానికి మమ్ముట్టి వెళ్లారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనున్న 'కైరాలి పీపుల్ ఇన్నొటెక్ అవార్డ్స్' కార్యక్రమానికి కేటీఆర్ ను ముఖ్య అతిథిగా మమ్ముట్టి ఆహ్వానించారు. ఈ సందర్భంగా `చార్మినార్` ప్రతిని మమ్ముట్టికి కేటీఆర్ బహూకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ - మమ్ముట్టిలు కలిసి దిగిన ఫోటోలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ట్విట్టర్ అధికారిక ఖాతా అయిన `మినిస్టర్ ఐటీ - తెలంగాణ`లో పోస్ట్ చేశారు. మలయాళ మెగా స్టార్ తో కేటీఆర్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న `యాత్ర` బయోపిక్ లో మమ్ముట్టి నటిస్తోన్న సంగతి తెలిసిందే. జననేత వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తుండడంతో `యాత్ర`పై ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన‘యాత్ర’ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ లో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ బయోపిక్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.