Begin typing your search above and press return to search.

మ‌రో థియేట‌ర్ బుగ్గి పాలు!

By:  Tupaki Desk   |   23 April 2019 4:13 AM GMT
మ‌రో థియేట‌ర్ బుగ్గి పాలు!
X
మండు వేస‌విలో అగ్ని ప్ర‌మాదాల‌కు ఆస్కారం ఎక్కువ‌. జ‌న‌స‌మ్మ‌ర్థంగా ఉండే కూడ‌ళ్ల‌లో సైతం సినిమా థియేట‌ర్ల‌లో అగ్ని ప్ర‌మాదాలు ప్ర‌త్య‌క్షంగా చూస్తున్న‌దే. 2018 సెప్టెంబ‌ర్ లో గాజువాక శ్రీ‌క‌న్య థియేట‌ర్ షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల మంట‌ల్లో బుగ్గి పాలైన సంగ‌తి తెలిసిందే. సెక్యూరిటీ గార్డ్స్ చూస్తుండ‌గానే అగ్నికీల‌లు ఎగ‌సిప‌డి థియేట‌ర్ లో ఫ‌ర్నీచ‌ర్ మొత్తం బుగ్గి పాలైంది. ఫైర్ ఇంజిన్లు ఆ మంట‌ల్ని ఆర్పేందుకు ప్ర‌య‌త్నించినా జ‌ర‌గాల్సిన న‌ష్ట జ‌రిగిపోయింది. తాజాగా అలాంటి స‌న్నివేశ‌మే తూర్పు గోదావ‌రి జిల్లా మ‌లికిపురం లో ఎదురైంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం మ‌లికిపురం- ప‌ద్మ‌జ ఏసీ థియేట‌ర్ మంట‌ల్లో చిక్కుకుని పూర్తిగా బుగ్గిపాలైంది.

అయితే ఈ ప్ర‌మాదం స‌రిగ్గా మ్యాట్నీ ఆట మొద‌ల‌వ్వ‌డానికి కొన్ని నిమిషాల ముందు జ‌ర‌గ‌డం భ‌యం క‌లిగించేదే. అప్ప‌టికే థియేట‌ర్ నిండా జ‌నాలు కూచుని ఉన్నారు. అయితే అగ్ని ప్రమాదాన్ని ముందే ప‌సిగ‌ట్టిన థియేట‌ర్ యాజ‌మాన్యం వెంట‌నే ప్రేక్ష‌కుల్ని అలెర్ట్ చేసి థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు పంపేసింది. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ థియేట‌ర్ లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `చిత్ర‌ల‌హ‌రి` ఆడుతోందని అక్క‌డ ఉన్న పోస్ట‌ర్ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ప‌ద్మ‌జ థియేట‌ర్ మంట‌ల్లో చిక్కుకున్న వీడియోలు.. ఫోటోలు సామ‌జిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మంట‌ల్లో థియేట‌ర్ టాప్ పూర్తిగా కాలిపోయింది. అలాగే హాల్ లో కుర్చీలు.. ఇత‌ర‌త్రా ఫ‌ర్నీచ‌ర్ ఆల్మోస్ట్ ధ‌గ్ధ‌మ‌య్యాయి. న‌ష్టం పెద్ద ఎత్తున సంభ‌వించింద‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం చెబుతోంది. ఫైర్ ఇంజిన్ వ‌చ్చి ఆర్పే లోపే జ‌ర‌గాల్సిన‌ది జ‌రిగిపోయింద‌న‌డానికి ఈ ఫోటోలే సాక్ష్యం. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. ప‌ద్మ‌జ థియేట‌ర్ చైన్ తెలుగు రాష్ట్రాల్లో ఫేమ‌స్ అన్న టాక్ ఉంది.