భరత్ నిజమైన ప్రత్యర్థులు వీళ్ళే

Tue Apr 17 2018 13:51:35 GMT+0530 (IST)

మరో మూడు రోజుల్లో భరత్ అనే నేను చేయబోయే రచ్చకు తెర లేవనుంది. ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకోవడం సహజమే కాని ప్రేక్షకుల్లో కూడా దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. దానికి ప్రధాన కారణం మహేష్ మొదటిసారి సీరియస్ పొలిటికల్ డ్రామా చేయటమే. ట్రైలర్ మొదలుకుని ఆడియో దాకా అన్ని శుభం భూయాత్ తరహాలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడం దీనికి హైప్ ఇంకా పెంచేసింది. నిజానికి భరత్ అనే నేను ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్ లో కట్ చేయలేదు. చాలా తెలివిగా సింపుల్ గా కథ దేని గురించి ఉంటుందో చూచాయగా చెప్పేసి వదిలేసారు అంతే. కాకపోతే క్లాస్ కు మాస్ కు కావలసిన అంశాలు అన్ని ఉన్నాయనే హామీ అయితే అందులో ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం లో ప్రొఫైల్ ని కావాలని మైంటైన్ చేయటమే అని చెప్పొచ్చు. మహేష్ బాబు సినిమాలు ఎలా ఉన్నా వాటికి సంబంధించిన టాక్ మాత్రం బెనిఫిట్ షో కాగానే విపరీతంగా వైరల్ అయిపోతోంది. సోషల్ మీడియాలో యాంటీ ఫాన్స్ కూడా బాగా యాక్టివ్ గా ఉండటంతో యావరేజ్ గా ఉన్న మూవీ కూడా మరోరకంగా స్ప్రెడ్ అవుతోంది. అందుకే హైప్ తక్కువగా ఉంటే సినిమాలో కంటెంట్ కి సర్ప్రైజ్ అయిన ప్రేక్షకులు బయటికి బ్రహ్మాండమైన టాక్ తీసుకొస్తారు. రంగస్థలం విషయంలో జరిగింది ఇదే.పైకి చెప్పినా చెప్పకపోయినా భరత్ మీద రంగస్థలం రికార్డుల ఒత్తిడి ఖచ్చితంగా ఉంది. వంద కోట్లకు పైగా షేర్ ను మూడు వారాలు దాటకముందే రాబట్టిన రామ్ చరణ్ కు ధీటుగా మహేష్ అంత కన్నా త్వరగా అది చేరుకోవాలనే అంచనాలు ట్రేడ్ లో భారీగా ఉన్నాయి. ఇక్కడ ప్రీమియర్ షో టాక్ చాలా ఇంపార్టెంట్. ఓవర్సీస్ లో రెండు వేల షోలు ప్లాన్ చేయటం కలెక్షన్స్ పరంగా హెల్ప్ అయ్యేదే కాని అక్కడ ఎన్ ఆర్ ఐలు ఇక్కడ కంటే ముందు అక్కడ సినిమా చూస్తున్నామన్న ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం కూడా కొంత ఉత్సాహాన్ని నీరు గారుస్తోంది. ఇది ఇప్పటికిప్పుడు పరిష్కరించలేని సమస్యే అయినా ముందు ముందు దృష్టి పెట్టాల్సిందే. ఇప్పుడు తెల్లవారుజామున బెనిఫిట్ షో అంటే ఆయా హీరోల అభిమానులు మాత్రమే రావడం లేదు. అందరూ ఉంటున్నారు. థియేటర్ లోపలి అడుగు పెట్టే ప్రతి ఒక్కరు ఆ హీరోను అమితంగా ఇష్టపడేవాళ్ళు అని చెప్పడానికి లేదు. ఆ షోల నుంచి డివైడ్ టాక్ ముందు బయటికి రావడానికి ఇదే ప్రధాన కారణం. కాకపోతే మహేష్ లాంటి హీరోల విషయంలో దీని తీవ్రత అధికంగా ఉంటుంది. ఖలేజా - 1 లాంటి సినిమాలు పెర్ఫార్మ్ చేయాల్సిన దాని కన్నా తక్కువ స్థాయిలో ఆడటం వెనుక ఇదే కారణం. అందుకే అవి టీవీ లో బాగా ఆడాయి.

 సో భరత్ అనే నేను విషయంలో అభిమానులు కూడా అత్యుత్సాహానికి లోను కాకుండా ఏవేవో ఊహించుకుని కేవలం రికార్డులు బద్దలు కొట్టడం కోసమే మా హీరో సినిమా తీసాడు అన్న కోణంలో కాకుండా న్యూట్రల్ మైండ్ తో చూస్తే మెరుగ్గా అనిపించే అవకాశం ఏ సినిమాకైనా ఉంటుంది. మహేష్ బాబు ఒక్కడు - మురారి - పోకిరి లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి అంటే అ సమయంలో వాటి మీద రన్ అయిన లో ప్రొఫైల్ హైప్ కూడా కారణమే. భరత్ అనే నేను తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సెంటర్ లోనూ ఎంత లేదన్నా మొదటి రోజే వందలాది షోలు పోటెత్తనున్నాయి. ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి టెన్షన్ లేదు కాని ఏ చిన్న అసంతృప్తి ని ట్రాలింగ్ రూపంలోనో లేక సోషల్ మీడియాలో మెసేజ్ రూపంలో పోస్ట్ చేస్తేనే అసలు చిక్కు. పైగా మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోలు తామంతా ఒక్కటే అని చాటి చెప్పాడు. రామ్ చరణ్ ని రంగస్థలం విషయంలో పొగిడి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ వేడుకకు పిలిపించుకున్నాడు. ఇది అభిమానుల మధ్య గ్యాప్ ను తగ్గించేదే. పవన్ ఫాన్స్ ఈ విషయంలో కొంత వ్యతిరేకత ఉన్నట్టు అనిపించినా ఇప్పుడు తీవ్రత తగ్గింది అని చెప్పొచ్చు. బ్రహ్మోత్సవం-సర్దార్ గబ్బర్ సింగ్ తక్కువ గ్యాప్ లో విడుదలైనప్పుడు ఒకరిని మించి ఒకరు ఫాన్స్ దుమ్మెత్తి పోసుకుని కామెడీ చేసుకున్నారు. స్పైడర్ టైంలో కాని అజ్ఞాతవాసి విషయంలో కాని ఆ మోతాదు తగ్గింది. సో భరత్ అనే నేను ఆ దిశగా టెన్షన్ పడనక్కర్లేదు. కొరటాల శివ కథలు అసాధారణంగా ఉండవు. కాని హీరోయిజం అనే ఆత్మను సందేశంతో కలగలిపి హీరో ఇమేజ్ ని పూర్తిగా వాడుకుని తెరపై ఆవిష్కరించే దాంట్లో అతను మాస్టర్. భరత్ అనే నేను కూడా అదే కోవలోకి వస్తుందనే నమ్మకం సర్వత్రా ఉంది. రంగస్థలం కొట్టిన డబుల్ సెంచరీని భరత్ అనే నేను కంటిన్యూ చేసి టికెట్ కౌంటర్ల దగ్గర రద్దీ తగ్గకుండా చూసుకోవడం శుక్రవారం నుంచి మొదలుకానుంది. వేచి చూద్దాం.