యాత్ర 2 అంటున్న మహీ వీ రాఘవ్!

Thu May 23 2019 17:26:32 GMT+0530 (IST)

'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహీ వీ రాఘవ్ కొద్ది నెలల క్రితం 'యాత్ర' సినిమాతో తెలుగుప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. స్వర్గీయ వైయస్సార్ రాజకీయ జీవితంలోని ప్రధాన ఘట్టమైన పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకొని మహి వీ రాఘవ్ 'యాత్ర' ను రూపొందించారు.  మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్సార్ పాత్రలో నటించి తనదైన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.  ఇదిలా ఉంటే తాజాగా 'యాత్ర' సీక్వెల్ కు బీజం పడింది.ఇదేదో గాసిప్ కాదు. దర్శకుడు మహీ వీ రాఘవ్ తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వైయస్ జగన్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసిన మహి.. "@YSR Party. వైయస్ జగన్ అన్నా.. ఇది నిజంగా మీకు తగిన విజయం.  మీరు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా వైయస్ రాజశేఖరరెడ్డిగారి కంటే ఎక్కువగా ప్రజల ఆకాంక్షలు నేరవేరుస్తారని ఆశిస్తున్నా.  నేను చెప్పాల్సిన ఒక కథను మీరు రాశారు.. #యాత్ర 2 @శివమేక" అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతానికి ఇంతకు మించి మహీ ఇతర వివరాలను వెల్లడించలేదు కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాల మూడ్ ను బట్టి చూస్తే ఇది ఒక క్రేజీ అనౌన్స్మెంట్ అని మాత్రం చెప్పవచ్చు.  మరి  జగనన్న పాత్రలో ఏ హీరో నటిస్తాడో  తెలియాలంటే మనం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.