‘స్పైడర్’ కొడితే.. మామూలుగా ఉండదు

Tue Sep 12 2017 10:22:30 GMT+0530 (IST)

‘స్పైడర్’ సినిమా గురించి కొన్ని రోజుల ముందు వరకు నెగెటివ్ విషయాలు వినిపించాయి కానీ.. విడుదల తేదీ దగ్గరికొచ్చే సరికి సీన్ మారుతోంది. మొన్నటి ఆడియో వేడుకలో మురుగదాస్.. మహేష్ బాబు సహా అందరూ ఈ సినిమా గురించి చెప్పిన మాటలు.. పాటలు.. వాటి ప్రోమోలు ‘స్పైడర్’ మీద ఇప్పటికే ఉన్న అంచనాల్ని పెంచాయి. మామూలుగా తన సినిమాల గురించి ముందే ఎక్కువగా చెప్పుకోని మురుగదాస్.. ఈ చిత్రం స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని.. అందుకు మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతున్నానని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాబట్టి ‘స్పైడర్’ అంత తేలికైన సినిమా కాదని భావించవచ్చు. ‘స్పైడర్’కు జరిగిన బిజినెస్ లెక్కలు చూస్తే.. దీనిపై ట్రేడ్ వర్గాల్లో కూడా ఏ స్థాయి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఇక ‘స్పైడర్’ రిలీజ్ డేట్ విషయంలో చాలా ముందుగానే పక్కా ప్రణాళిక రచించింది చిత్ర బృందం. దసరా సెలవులు కావడంతో బుధవారమే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్ణయించారు. పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ఐదు రోజుల పాటు సినిమా దున్నేసుకోవడం ఖాయం. మామూలుగానే మహేష్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. పైగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక పాజిటివ్ టాక్ కూడా వచ్చిందంటే.. వీకెండ్లో కళ్లు చెదిరే బాక్సాఫీస్ నంబర్స్ చూడొచ్చు. రెండు భాషల్లో విడుదలవుతున్న సినిమా కాబట్టి.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సౌత్ ఇండియాలో నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలైనా ఆశ్చర్యం లేదు. మరి మురుగ-మహేష్ కాంబినేషన్ మీద ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకం ఎంతమేరకు నిజమవుతుందో చూడాలి.