మహేశ్ 'రెడ్డి గారి అబ్బాయి' అయిపోతున్నాడు

Fri May 17 2019 23:08:38 GMT+0530 (IST)

‘మహర్షి’ సినిమాతో మాంచి ఊపు మీదున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా - అశ్వనీదత్ - పీవీపీ - దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాతో తన అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారని చెప్పిన మహేశ్.. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో అదే పని చేసి చూపించాడు. గత రెండు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న మహేశ్.. ఈ సారి మాత్రం త్వరగానే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయాడు. ఇందుకోసం ‘మహర్షి’ సెట్స్ పైన ఉండగానే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు. మహేశ్.. డేట్స్ ఇచ్చిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

 దిల్ రాజు - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు రాయలసీమకు చెందిన యువకుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్  డ్రాప్ లో తెరకెక్కబోతుందని సమాచారం. అంతేకాదు - ఈ సినిమాకు ‘రెడ్డి గారి అబ్బాయి’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని తాజాగా ఓ వార్త ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. దిల్ రాజు ఇప్పటికే ఈ టైటిల్ ను ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించారనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథే అయినా.. అనిల్ రావిపూడి స్టైల్ లో వినోదభరితంగా సాగనుందని తెలిసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకరుస్తున్నాడు. జూలై మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ అధికారికంగా మొదలుకానుంనది.