Begin typing your search above and press return to search.

'కల్కి' దర్శకుడిని ఏకి పారేసిన మహేష్‌ ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:36 AM GMT
కల్కి దర్శకుడిని ఏకి పారేసిన మహేష్‌ ఫ్యాన్స్‌
X
'అ!' వంటి విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తాజాగా రాజశేఖర్‌ హీరోగా 'కల్కి' చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి నుండి కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమా షూటింగ్‌ మొదలు రేపు విడుదల కాబోతున్న వరకు కూడా ప్రమోషన్స్‌ విషయంలో కొత్త తరహాగా ఆలోచిస్తూ సినిమాపై జనాల ఫోకస్‌ పడేలా చేశాడు. టీవీ ప్రోమోస్‌ ను విభిన్నంగా కట్‌ చేయడంతో పాటు పాటకు డాన్స్‌ చేయమంటూ సోషల్‌ మీడియాలో ఛాలెంజ్‌ ప్రారంభించడం ఇలా తన సినిమాను బాగా ప్రమోట్‌ చేశాడు.

ఇక ఈ చిత్రంలో రాజశేఖర్‌ ఒకానొక సీన్‌ లో పోలీస్‌ డ్రస్‌ వేసుకుని బుజాన నాగలి పట్టుకుని ఉంటాడు. ఇప్పుడది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ స్టిల్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఇప్పుడు కమర్షియల్‌ సినిమాల్లో హీరోలు నాగలి ఎత్తడం తప్పనిసరి అయ్యింది. అలాంటి పోస్టర్‌ తప్పకుండా విడుదల చేయాల్సి వస్తుందంటూ ఫన్నీ సింబల్‌ పెట్టాడు. ఈ పోస్ట్‌ మహేష్‌ బాబు అభిమానుల మనోభావాలపై ప్రభావం చూపింది. మహర్షి చిత్రంలో మహేష్‌ బాబు నాగలి ఎత్తాడు.. దాన్ని ఉద్దేశించి ప్రశాంత్‌ వర్మ ఈ కామెంట్స్‌ చేశాడా అంటూ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అతడి పోస్ట్‌ కు మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ చాలా సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యి.. వయలెంట్‌ గా కామెంట్స్‌ చేస్తున్నారు. రెండవ సినిమాకే మరీ ఇంత బలుపు పనికి రాదంటూ కొందరు.. హద్దుల్లో ఉండకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేవంటూ మరి కొందరు ఘాటుగా ప్రశాంత్‌ వర్మను ఏకి పారేశారు. దాంతో ప్రశాంత్‌ వర్మ రియాక్ట్‌ అయ్యాడు. తన గత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తన అభిమాన నటుడు మహేష్‌ బాబు అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పానని పేర్కొన్నాడు. తనకు మహేష్‌ పై గౌరవం ఉందని చెబుతూ ఫ్యాన్స్‌ ను కూల్‌ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రమోషన్‌ కోసం చేసే కొన్ని పోస్ట్‌ లు ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్‌ ను ఇబ్బంది పెడితే మొదటికే మోసం వస్తుందనే విషయంను యంగ్‌ డైరెక్టర్స్‌ గుర్తించాలి. లేదంటే సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది.