పోకిరి తరహాలో మహేష్ 25

Mon Apr 23 2018 14:15:25 GMT+0530 (IST)

భరత్ అనే నేను విజయంతో ట్రాక్ లోకి వచ్చేసిన ప్రిన్స్ మహేష్ బాబు తన 25వ సినిమాకు రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఆ సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే దాని గురించి ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొంది. మహేష్ గత నాలుగేళ్లలో చేసిన సినిమాలు గమనిస్తే అన్నింటిలోను బాగా డబ్బున్న వాడిగానే నటించాడు. మనవాడే అనిపించే మాస్ పాత్రలో కనిపించి చాలా కాలమే అయ్యింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మహేష్ చేసినవన్నీ హై ప్రొఫైల్ హీరో రోల్స్. అందుకే వంశీ పైడిపల్లి మహేష్ ని సరికొత్తగా చూపబోతున్నట్టు టాక్. టఫ్ గా కనిపించే ఊరమాస్ లుక్ లో మెడలో కర్చీఫ్ తో పోకిరి తరహాలో కనిపించబోతున్నట్టు టాక్. అదే కనక నిజమైతే మహేష్ ఫాన్స్ పండగ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.ఇక ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్న అల్లరి నరేష్ బాగా డబ్బున్న వాడిగా కనిపిస్తాడని తెలిసింది. మరి మహేష్ కి ఫ్రెండ్ గా ఉంటాడా లేక ఏదైనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రనా అనేది తెలియాల్సి ఉంది.పూజా హెగ్డే హీరొయిన్ గా నటించే ఈ మూవీని దిల్ రాజు-అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ కు త్వరలోనే వెళ్లనున్న ఈ మూవీలో మహేష్ ని దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్తగా చూపనున్నట్టు టాక్. గతంలో ఎవడు లాంటి సినిమా ద్వారా మాస్ ని బాగా ఆకట్టుకోగలను అని ప్రూవ్ చేసిన వంశీ ఇందులో కూడా అంతకు మించి ట్రీట్మెంట్ తో తీర్చిదిద్దుతున్నట్టు టాక్. స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయిపోయింది కాబట్టి మొదలుపెట్టడం ఆలస్యం జెట్ స్పీడ్ తో దూసుకుపోవడమే మిగిలి ఉంటుంది.