హౌస్ నుంచి కత్తిని పంపించేశారు

Sun Aug 13 2017 12:27:41 GMT+0530 (IST)

ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది తెలుగు బిగ్ బాస్ కి. ఈ షో ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని చూస్తున్నంత సేపు.. చూసిన తర్వాత నెగిటివ్ గా మాట్లాడుతూనే.. మళ్లీ దీన్ని ఫాలో కావటం. అందుకే టాక్ కు భిన్నంగా టీఆర్పీ రేటింగ్ లలో దూసుకెళుతోంది బిగ్ బాస్. ప్రతి వారాంతంలోనూ ఒక కంటెస్టెంట్‌ను బయటకు పంపే సంప్రదాయానికి తగ్గట్లు.. నాలుగో వారంతో సినీ విశ్లేషకుడు.. విమర్శకుడిగా పేరున్న మహేశ్ కత్తిని బయటకు పంపేశారు.ప్రతి వారం చివర్లో పాపులార్టీ తక్కువగా ఉండే వారిని షో నుంచి బయటకు పంపటం తెలిసిందే. వాస్తవానికి ఈ వారం ఇద్దరు పార్టిసిపెంట్లు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే.. మహేశ్ ను శనివారం బయటకు పంపేశారు. ఈ రోజు (ఆదివారం) మరొకరి పేరును ఎలిమినేట్ చేయనున్నారు. నిజానికి కత్తిని తొలి వారంలోనే  షో నుంచి ఎలిమినేట్ కావాల్సింది. కానీ.. ఆ వారం జ్యోతి బయటకు రావటంతో ఆయన బయటపడి సేఫ్ అయ్యారు.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను అమలు చేసే విషయంలో రూల్స్ ను పాటించకపోవటంతో ఆయన హౌస్ నుంచి ఎలిమినేట్ కాక తప్పలేదు. గత వారం సమీర్ కు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను సక్రమంగా నిర్వహించటంలో ఫెయిల్ కావటంతోనే ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా కత్తికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో.. నాలుగు వారాల అనంతరం ఈసారి మాత్రం ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు.

స్వతహాగా విమర్శకుడైన కత్తి మహేశ్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లోపల ఉన్న వారి గురించి చేసిన విశ్లేషణ అందరిని ఆకట్టుకుంది. ధన్ రాజ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని.. ఆదర్శ్ కూడా అతి చేస్తున్నాడని.. ముమైత్ రాక్షసి అని సరదాగా వ్యాఖ్యానించారు. కత్తికి ముమైత్ ఐలవ్యూ అని చెప్పగా.. తిరిగి లవ్ టూ అని చెప్పాడు. షో నుంచి ఎలిమినేట్ అయ్యేవారు లోపల ఉన్న వారిలో ఒకరికి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అదర్శ్ కు కత్తి శిక్ష వేశాడు. వారం రోజుల పాటు సహచరులందరి ప్లేట్లు కడగాలన్నాడు.

బిగ్ బాస్ హౌస్ విశేషాల గురించి ప్రయోక్త తారక్ ప్రస్తావించినప్పుడు.. హౌస్ లో ఉన్నప్పుడు తాను చాలా నేర్చుకున్నానని.. చాలా అనుభవంతో.. ఆలోచనలతో బయటకు వచ్చానన్నాడు. ఈ షో గురించి అందరికి తెలియజేసేందుకు త్వరలో పుస్తకం రాయనున్నట్లు వెల్లడించాడు. కత్తి మాటలకు స్పందించిన తారక్.. ఆ పుస్తకంలో తనకు ఒక పేజీ కేటాయించాలంటూ సరదాగా రిక్వెస్ట్ చేశాడు. మరి.. విమర్శకుడైన కత్తి తన కలానికి పదును పెట్టి.. రానున్న రోజుల్లో బిగ్ బాస్ గురించి ఎవరికి తెలీని ఏ విషయాలు చెప్పబోతున్నాడో చూడాలి. ఇక.. షో విషయానికి వస్తే ఈ రోజు ఎలిమినేషన్ లిస్ట్ లో హరితేజ.. కల్పన ఉన్నారు. వీరిలో ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. మరోవైపు.. వైల్డ్ కార్డు ఎంట్రీతో హీరో నవదీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతారన్న మాట వినిపిస్తోంది.