Begin typing your search above and press return to search.

మహేష్ ఇంకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

By:  Tupaki Desk   |   23 May 2017 11:02 AM GMT
మహేష్ ఇంకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?
X
మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పైడర్’కు ఇంకా గుమ్మడికాయ కొట్టకుండానే కొరటాల శివ డైరెక్షన్లో కొత్త సినిమా ‘భరత్ అను నేను’ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మహేష్ బాబు. ఈ సినిమా ఘనమైన ప్రారంభోత్సవాల్లేంటివేమీ లేకుండా సింపుల్ గా ముహూర్త కార్యక్రమం కానిచ్చేసి రెగ్యులర్ షూటింగుకి వెళ్లిపోవడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ వేసుకున్నారు. ‘స్పైడర్’ కోసం చాలా టైం తీసుకున్న మహేష్.. కొరటాల సినిమా విషయంలో అలా జరగకూడదని అప్రమత్తం అవుతున్నాడు. అనుకున్న ప్రకారమే సంక్రాంతికి ‘భరత్ అను నేను’ను విడుదలకు సిద్ధం చేస్తే అభిమానులకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

ఐతే కొరటాల సినిమా కంటే ముందు మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి సినిమాకు కమిటైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే విషయంలో కొంత తర్జన భర్జన నడిచింది. చివరికి పీవీపీ నుంచి ఈ సినిమాను దిల్ రాజు.. అశ్వనీదత్ తీసుకున్న సంగతి తెలిసిందే. పీవీపీతో వంశీ వివాదాన్ని కూడా సెటిల్ చేసేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోపు ఈ సినిమాకు సంబంధించి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం మహేష్ బాబు తండ్రి.. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును వేదికగా చేసుకోబోతున్నారు. ఈ నెల 31న కృష్ణ జన్మదిన కానుకగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందట. ఆ సందర్భంగా మహేష్ కొత్త లుక్‌ తో ఒక పోస్టర్ లాంచ్ చేస్తారట. దీంతో పాటు ‘భరత్ అను నేను’ లోగోను కూడా ఆ రోజే రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మరి ‘స్పైడర్’ టీం ఆ రోజు ఏదైనా స్పెషల్‌గా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.