‘స్పైడర్’ అందుకే పోయిందన్న మహేష్

Thu Apr 19 2018 16:00:47 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ తెగ బిజీగా ఉన్నాడు. రేపు విడుదలవుతున్న ఈ సినిమాపైన మహేష్ ఫుల్లు కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. భరత్ కచ్చితంగా హిట్టు కొడతాడనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే మహేష్ రీసెంట్ గా  ఓ  ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ఏడాది షాకిచ్చిన ‘స్పైడర్’ సినిమా గురించి మాట్లాడాడు.తమిళ క్రియేటివ్ దర్శకుడు మురగదాస్ తెరకెక్కించిన ‘స్పైడర్’ సినిమా విడుదల సమయంలో ఫుల్లు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ప్రిన్స్. కానీ ఊహించని విధంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే రెండు భాషల్లో ఒకే సారి తెరకెక్కించడం వల్లే ఈ సినిమా పోయిందని అంటున్నాడు మహేష్ బాబు. ‘‘స్పైడర్ సినిమాను రెండు భాషల్లో ఒకే సారి తీయాలనుకోవడం చాలా పెద్ద మిస్టేక్. మురగదాస్ ఫెంటాస్టిక్ డైరెక్టర్. మేం ద్వి భాషా చిత్రం చేస్తున్నా కూడా రెండు భాషల ప్రజలకు నచ్చే విధంగా సినిమా తీసేందుకు ఆయన చాలా కష్టపడ్డాడు. కానీ తమిళ ప్రజలతో పోలిస్తే తెలుగు వాళ్ల అభిరుచి వేరుగా ఉంటుంది. మనవాళ్లు హీరోయిజం కోరుకుంటారు. అక్కడ అలా ఉండదు. కథకే ప్రాధాన్యం ఇస్తారు. రెండు భాషల్లో తెరకెక్కించినా తమిళ మార్కెట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దాంతో అనుకున్న స్క్రిప్టులో చాలా మార్పులు జరిగాయి. చివరికి సినిమా రిజల్ట్ దెబ్బ పడింది...’’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్.

ఒకే భాష మీద పూర్తి దృష్టి పెట్టి తీసి ఉంటే... ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేదని అన్నాడు ప్రిన్స్. ‘స్పైడర్’ కొట్టిన దెబ్బతో మళ్లీ జీవితంలో ప్రయోగాల జోలికి వెళ్లనని చెప్పాడు మహేష్. ఆ సినిమా ఫలితం ఆయన్ని అంతలా భయపెట్టింది మరి.