మహేష్ పంచులే పంచులు

Tue Apr 24 2018 13:44:02 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందని అతడి సన్నిహితులు చెబుతుంటారు. ఈ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్లు మహేష్‌కు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇటీవలే ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు మహేష్ తనదైన శైలిలో పంచులతో అలరించాడు. తాజాగా అతను ఈ చిత్ర థ్యాంక్స్ మీట్లోనే తనదైన శైలిలో పంచులు కురిపించాడు. అందరినీ నవ్వించాడు.‘భరత్ అనే నేను’ టీం సభ్యులందరి గురించి మహేష్ ఒక్కొక్క మాటలో భలేగా మాట్లాడాడు. నిర్మాత డీవీవీ దానయ్య ప్రస్తావన వచ్చినపుడు ఆయన సినిమా ఫలితం గురించి రెస్పాండయిన తీరు భలేగా అనిపించిందని.. ‘ఎందుకు హిట్టవ్వదు. కచ్చితంగా హిట్టవుతుంది’ అని దానయ్య అన్నాడని మహేష్ చెప్పాడు. గీత రచయిత రామజోగయ్య గురించి మాట్లాడుతూ.. ‘యు రాక్ ఇట్ బ్రో’ అని మహేష్ అన్నపుడు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఇక దర్శకుడు కొరటాల ప్రస్తావన వచ్చినపుడు.. ‘‘నేను.. కొరటాల గారు సినిమాలు చేస్తూనే ఉంటాం. బ్లాక్ బస్టర్లు కొడుతూనే ఉంటాం’’ అని మహేష్ అన్నాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. అతను కేవలం మ్యూజిక్ డైరెక్టర్ కాదని.. స్టోరీ టెల్లర్ అని.. తన నేపథ్య సంగీతం ద్వారా అతను సినిమా కథను చెబుతాడని మహేష్ బాబు అన్నాడు. ‘భరత్ అనే నేను’ విడుదలకు ముందు చాలా టెన్షన్లో ఉన్నానని.. అప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్లి ఆమె ఇచ్చిన కాఫీ తాగగానే టెన్షన్ మొత్తం పోయిందని మహేష్ చెప్పడం విశేషం.