మహేష్ మళ్లీ దొరికిపోయాడు

Thu Nov 08 2018 11:00:33 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని ట్వీట్లు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో కానీ.. అవి అనుకున్నంత సానుకూల సంకేతాల్ని ఇవ్వట్లేదు. అతడి పట్ల అవి నెగెటివిటీనే పెంచుతున్నాయి. తాజాగా మన సూపర్ స్టార్.. మురుగదాస్ కొత్త సినిమా ‘సర్కార్’ గురించి ఒక పాజిటివ్ ట్వీట్ వేశాడు. ఈ చిత్రంలో మురుగదాస్ మార్క్ కనిపించిందని.. సినిమా చాలా బాగుందని ప్రశంసించాడు. ఐతే తనకు ‘స్పైడర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చినా.. అదేమీ మనసులో పెట్టుకోకుండా మురుగదాస్ కొత్త సినిమాను ప్రశంసించడం.. అతడి గురించి సానుకూలంగా మాట్లాడటం మహేష్ గొప్ప మనసుకు నిదర్శనమని అభిమానులు అతడిని పొగిడేస్తున్నారు. కానీ మిగతా వాళ్లు మాత్రం మహేష్ ను మరో రకంగా టార్గెట్ చేస్తున్నారు. తమిళులపై మహేష్ చూపించే ప్రత్యేక అభిమానం గురించి ప్రస్తావిస్తున్నారు.తెలుగులో రిలీజయ్యే మంచి మంచి సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని మహేష్ బాబుకు తమిళ సినిమాల మీద మాత్రం ప్రత్యేక అభిమానమని.. అందుకే డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాల్ని ప్రశంసిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఆ మధ్య మణిరత్నం సినిమా ‘చెక్క చివంత వానం’ను కూడా పొగిడాడు మహేష్. నిజానికి మహేష్ చెప్పినంత గొప్ప సినిమా ఏమీ కాదది. తాజాగా ‘సర్కార్’ కూడా డివైడ్ టాక్ తో నడుస్తోంది. దీన్ని మహేష్ పొగిడాడు. ఇక కొన్నేళ్ల కిందట తమిళనాట జల్లికట్టు ఉద్యమానికి మద్దతుగా గళం విప్పిన వాళ్లలో మహేష్ కూడా ఒకడు. ఎప్పుడూ తనకు రాజకీయాలు తెలియవని.. వాటి గురించి మాట్లాడనని అనే మహేష్.. జల్లికట్టు విషయంలో మాత్రం స్పందించాడు. ఈ వివాదం విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు. కొన్ని నెలల కిందట కేరళ వరదలకు చలించిపోయి విరాళం ప్రకటించిన మహేష్.. ఉత్తరాంధ్రను ముంచెత్తిన తిత్లీ తుపాను సమయంలో మాత్రం సైలెంటుగా ఉండిపోయాడు. ఇదంతా చూసి వేరే రాష్ట్రాల వాళ్లపై చూపించే అభిమానం మనవాళ్ల విషయంలో ఏమవుతోందని మహేష్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.