స్పైడర్ ఎలాంటి సినిమానో చెప్పిన మహేశ్

Mon Sep 25 2017 07:00:01 GMT+0530 (IST)

భారీ అంచనాలతో ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పైడర్ మూవీ మార్కెట్లోకి వచ్చేసే టైం దగ్గరకు వచ్చేసింది. మహా అయితే.. మూడు.. నాలుగురోజుల్లో బయటకు రానున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు ప్రిన్స్ మహేశ్ బాబు.స్పైడర్ ఏ తరహా సినిమా అన్న విషయాన్ని చెబుతూ..  మురుగుదాస్ తీసే సినిమాలు రెండు రకాలుగా ఉంటాయని.. ఇది పూర్తిస్థాయి జేమ్స్ బాండ్ మూవీ కాదన్నారు. రమణ.. కత్తి తరహా ఎమోషనల్ మూవీస్ చేసే మురుగుదాస్.. గజిని.. తుపాకి తరహా స్టయిలిష్ మూవీస్ చేస్తుంటారని.. తాజా స్పైడర్ రెండో తరహాకు చెందిన మూవీగా చెప్పాడు. స్పైడర్ మూవీలో తానో ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేసే ఆఫీసర్ అని చెప్పాడు.

ఈ మూవీలో యాక్షన్ పార్ట్కు చాలా స్కోప్ ఉందని.. శారీరకంగా తాను చాలా కష్టపడినట్లు చెప్పిన మహేశ్.. ఈ మూవీలో చాలా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని.. రెగ్యులర్ గా చూసే సినిమాలకు భిన్నమైన యాక్షన్ ఘట్టాలున్నాయని చెప్పాడు. రెండువేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో కలిసి చేసిన సీక్వెన్స్ లు అదిరిపోతాయని చెబుతున్నాడు. పీటర్ హెయిన్స్ చేసిన ఈ సీన్లలో ఏ మాత్రం మిస్ కాలిక్యులేట్ అయినా పెను ప్రమాదం వాటిల్లేదన్నాడు. అంత మందిని కో ఆర్డినేట్ చేస్తూ ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయటం జోక్ కాదన్నాడు. సినిమాలో కనిపించే ప్రతి చిన్న అంశం కథతో లింకై ఉండటం మురుగుదాస్ గొప్పతనంగా పొగిడారు మహేశ్.

స్పైడర్ లో ఎంపిక చేసుకున్న టెక్నికల్ టీం అదిరిపోయేలా ఉంటుందని.. డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్.. మ్యూజిక్ డైరెక్టర్.. ఫైట్ మాస్టర్.. ఇలా అందరూ హై ఎండ్ టెక్నికల్ స్టాఫ్ అని.. వీరందరితో కలిసి పని చేయటం నటుడిగా తానెంతో నేర్చుకోవటానికి సాయం చేసిందన్నాడు.

తొలిసారి రెండు భాషల్లో నటించిన అనుభవం సరికొత్తగా ఉందన్నాడు మహేశ్. ఒక షాట్ తమిళంలో చేస్తారు. దానికి కట్ చెప్పిన తర్వాత తెలుగులో చేస్తారు. రెండు భాషలకు రెండు మాడ్యులేషన్. పెర్ఫార్మెన్స్ విషయంలో రెండింటికి వేర్వుగా ఉంటుంది. షూటింగ్ స్టార్ట్ చేసిన మొదటి ఐదు రోజులైతే అసలేమీ అర్థం కాలేదు. లోతుకు దిగిపోయామా? అన్న టెన్షన్ వచ్చేసింది. కానీ.. మురుగదాస్ ఎనర్జీ అసాధారణం. అంతమందిని అన్ని రోజులు హ్యాండిల్ చేయటం మాటలు కాదని చెప్పాడు.

తన కెరీర్ లో భారీ అంచనాలతో విడుదలై.. దారుణంగా ఫెయిల్ అయిన చిత్రాల్లో ఒకటి బ్రహ్మోత్సవం. దాని గురించి చెబుతూ.. బ్రహోత్సవం లాంటి ప్లాప్స్ వచ్చినప్పుడు కచ్ఛితంగా డిప్రెషన్ ఉంటుందని.. దాని నుంచి తనను బయటపడేసింది తన పిల్లలే అని చెప్పాడు. ఈ సినిమా చేయటం రాంగ్ డెసిషన్ అని.. దాని వల్ల చాలామంది డబ్బులు పోయాయని.. తాను చాలా డిజప్పాయింట్ అయిన మాట వాస్తవమన్నాడు. నమ్మి డబ్బులు పెట్టినోళ్లు నష్టపోతే ఆ బాధను మాటల్లో వివరించలేనని.. అలాంటి అనుభవాలే పాఠాలుగా తీసుకొని మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పాడు.