Begin typing your search above and press return to search.

మహేష్ ట్రైలర్ చూస్తే అంత హడావుడా?

By:  Tupaki Desk   |   29 May 2016 11:30 AM GMT
మహేష్ ట్రైలర్ చూస్తే అంత హడావుడా?
X
మహేష్ బాబుకి ఓ సినిమా ట్రైలర్ నచ్చిందట.. అది పెద్ద వార్తయిపోయిందిప్పుడు. మా సినిమా ట్రైలర్ మహేష్‌కు నచ్చిందోచ్ అంటూ ప్రెస్ నోట్ ఇచ్చి మరీ పబ్లిసిటీ చేసుకంటోంది ‘ఒక్క అమ్మాయి తప్ప’ టీమ్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ‘ఒక్క అమ్మాయి తప్ప’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్న రాజసింహా చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అతడికి మహేష్ బాబుతో ‘టక్కరి దొంగ’ రోజుల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే రామోజీ ఫిలిం సిటీలో ‘బ్రహ్మోత్సవం’ కోసం షూటింగ్‌ చేస్తుండగా మహేష్‌ను కలిసి తన డైరక్టోరియల్ డెబ్యూ మూవీ ట్రైలర్ చూపించాడు. మహేష్ బావుందన్నాడట. అదిప్పుడు పెద్ద వార్త అయిపోయింది. మహేష్ బాబుకు మా ట్రైలర్ నచ్చిందోచ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

సర్లెండి మహేష్ సంగతి వదిలేస్తే ‘ఒక్క అమ్మాయి తప్ప’ ట్రైలర్ నిజంగానే జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. కాకపోతే ఇది ‘ఫోన్ బూత్’ అనే హాలీవుడ్ మూవీకి ఫ్రీమేకేమో అన్న ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవమెంతో చూడాలి. ఈ కథతో సినిమా తీయాలని రాజసింహా చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడట. సందీప్ కిషన్‌కు కూడా నాలుగేళ్ల ముందే ఈ కథ చెప్పాడట. సినిమా కథలో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిన రోడ్డు మీదే నడుస్తుంది. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ‘రేసుగుర్రం’ ఫేమ్ రవికిషన్ విలన్ పాత్ర పోషించాడు. ‘రుద్రమదేవి’తో డైలాగ్ రైటర్‌గా సత్తా చాటుకున్న రాజసింహా దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. జూన్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.