కార్పొరేట్ శ్రీమంతుడి దత్తత

Wed Jun 13 2018 12:23:20 GMT+0530 (IST)

ఊరిని దత్తత తీసుకుని బాగు చేయాలి లేదంటే లావైపోతాం అంటూ శ్రీమంతుడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు అందులో సామాజిక బాధ్యతను చూపించిన తీరు అందరి చేత మెప్పు పొందింది. సినిమాలో చెప్పారు సరే మరి నిజ జీవితంలో పాటించరా అనే కామెంట్ కు బదులుగా ఆ టైంలోనే సిద్ధాపురం-బుర్రిపాలెం గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన  సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు స్కూళ్ళు-రహదారులు ఏర్పాటు కాగా ఇంకా చేపట్టవలసినవి చాలానే ఉన్నాయి. మహేష్ తరఫున సతీమణి నమ్రతా శిరోద్కర్ వీటిని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెండు గ్రామాల అభివృద్ధికి 5 కోట్ల దాకా  నిధులు అవసరం అవుతుండటంతో కార్పొరేట్ సంస్థలను ఇందులో భాగస్వామ్యులుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇటీవలే నాట్కో ఫార్మా నుంచి సిద్ధాపురం గ్రామం కోసం నమ్రతా 25 లక్షల విరాళం వచ్చేలా చేయటం వెనుక ఉన్న ప్లానింగ్ ఇదేనని వినికిడి. ఒకరకంగా ఇది మంచి చర్యే అని చెప్పొచ్చు.మహేష్ కు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఒక్కడే వీటిని భరించగలడు కదా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతోంది. అవకాశం ఉన్నప్పుడు ఇతర సంస్థల ద్వారా నిధులు సమీకరించే వెసులుబాటు దొరికినప్పుడు వదులుకోవడం కూడా తప్పే. ఒకవేళ నిధులు వచ్చే ఛాన్స్ ఇక లేదు అనుకున్నప్పుడు స్వంతంగా జేబుల నుంచి డబ్బులు తీసే ఆలోచన చేయొచ్చు. దీని వల్ల మహేష్ చేయాలనుకున్న మంచి ఆ రెండు గ్రామాలకే పరిమితం కాకుండా ఎక్కువ ఊళ్లకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇది పాజిటివ్ యాంగిల్. మరో కోణంలో చూస్తే సినిమాకు పాతిక కోట్ల దాక పారితోషికంతో పాటు బ్రాండ్ అంబాసడర్ గా కూడా రెండు చేతులా సంపాదిస్తున్న మహేష్ ఓ ఐదారు కోట్లు ఇటు పెట్టేస్తే పోలా అనే కామెంట్ కూడా ఉంది. కానీ మహేష్ అభిమానులు ఆ రెండు ఊళ్ళలోనే లేరు కదా. తమ సేవలను అంతటా విస్తరింపజేయాలంటే ఇతరుల సహాయం అవసరం అంటూ మహేష్ ఫాన్స్ కన్విన్స్ అయ్యే వెర్షన్ లోనే మాట్లాడుతున్నారు. ఏదైతేనేం చేస్తోంది మంచి పని కాబట్టి ప్రోత్సహించడమే కరెక్ట్. సంఘానికి ఏదైనా చేద్దాం అనే హీరోల మనస్తత్వం ఎప్పుడైనా మంచి చేసేదే.