Begin typing your search above and press return to search.

మహేష్.. ముందు అది కంట్రోల్ చెయ్

By:  Tupaki Desk   |   24 May 2016 11:30 AM GMT
మహేష్.. ముందు అది కంట్రోల్ చెయ్
X
ఐతే బ్లాక్ బస్టర్.. లేకుంటే డిజాస్టర్.. ఇలా ఉంది మన స్టార్ హీరోల పరిస్థితి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఫ్లాపైనా సరే.. బయ్యర్లు బతికి బయట పడేవాళ్లు. ఫ్లాప్ సినిమాలు కూడా కొన్ని రోజులు థియేటర్లలో ఉండేవి. పైగా బడ్జెట్.. బిజినెస్ రెండూ కూడా హద్దుల్లో ఉండేవి. నిర్మాతలు వేలం వెర్రిగా ఖర్చు పెట్టేవాళ్లు కాదు.. బయ్యర్లు కూడా గుడ్డిగా ఎంతకు పడితే అంతకు సినిమాను కొనేవాళ్లు కాదు. కానీ ఇప్పుడంతా పరిస్థితి మారిపోయింది. ఎక్కువ ఖర్చు పెట్టడమే గొప్ప అన్నట్లు నిర్మాతలు రెచ్చిపోతున్నారు. హీరోలు.. దర్శకుల పారితోషకాల్ని వాళ్లే పెంచేస్తున్నారు. కథ మీద కాకుండా అనవసర హంగుల మీద దృష్టిపెడుతూ.. నిర్మాణ విలువల పేరుతో ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు. ఇక లేని హైప్ తీసుకొచ్చి బయ్యర్లకు సినిమాను భారీ రేట్లకు కట్టబెడుతున్నారు. దీంతో సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. మొత్తం తల్లకిందులైపోతోంది. బయ్యర్ల బతుకు బస్టాండైపోతోంది. నిర్మాత నష్టాల్ని కాంపెన్సేట్ చేయక తప్పని పరిస్థితి తలెత్తుతోంది.

తెలుగులో మహేష్ బాబు సినిమాలకు తరచుగా ఈ ఇబ్బంది ఎదురవుతోంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మహేష్ సినిమాలకు భారీ లెవెల్లో బడ్జెట్ పెరిగిపోతోంది. అలాగే బిజినెస్ కూడా ఆ స్థాయిలోనే అవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నిస్సందేహంగా రికార్డులు బద్దలైపోతున్నాయి. పాత రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. బయ్యర్లు - ఎగ్జిబిటర్లూ అందరూ కూడా భారీ లాభాలు అందుకుంటున్నారు. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా పరిస్థితి అలాగే ఉంటోంది. నష్టాల్లో రికార్డులు బద్దలైపోతున్నాయి. 1 నేనొక్కడినే.. ఆగడు.. తాజాగా బ్రహ్మోత్సవం సినిమాలు అందుకు ఉదాహరణ.

‘బ్రహ్మోత్సవం’ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక నష్టాలు మిగిల్చిన సినిమాగా రికార్డుల్లోకి వెళ్లబోతున్నట్లు చెబుతున్నారు. ‘శ్రీమంతుడు’ సక్సెస్ ను చూసి పీవీపీ సంస్థ ఇష్టానుసారం సినిమాకు ఖర్చు పెట్టడం.. అదే స్థాయిలో సినిమాను అమ్మడం వల్ల తలెత్తిన పరిస్థితి ఇది. కాస్త బడ్జెట్ హద్దుల్లో పెట్టుకుని ఉంటే ఇప్పుడీ దుస్థితి తలెత్తేది కాదు. ఓ 40 కోట్లలో సినిమాను ముగించగలిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్ని ఈ మాత్రం బడ్జెట్లో తీయట్లేదా? బాలీవుడ్లో కంటే కూడా ఇక్కడ బడ్జెట్లు పెంచేయడం సబబా అన్నది ఆలోచించుకోవాలి. మహేష్ కూడా తన సినిమాల బడ్జెట్.. బిజినెస్ విషయంలో కాస్త జాగ్రత్తపడకుండా అనేక చెత్త రికార్డుల్ని ఖాతాలో వేసుకోక తప్పదు.