Begin typing your search above and press return to search.

మహేష్ బ్లాక్ టికెట్ కొని చూసిన సినిమా?

By:  Tupaki Desk   |   24 May 2016 5:50 AM GMT
మహేష్ బ్లాక్ టికెట్ కొని చూసిన సినిమా?
X
మహేష్ బాబేంటి.. బ్లాక్ టికెట్ కొని సినిమా చూడ్డమేంటి అంటారా..? ఐతే తన టీనేజీలో అలాగే చేశానని అంటున్నాడు సూపర్ స్టార్. తాను కూడా చిన్నపుడు అందర్లాగే టికెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూల్లో నిలబడేవాడినని.. బ్లాక్ లో టికెట్లు కొని సినిమాలు చూసేవాడినని మహేష్ వెల్లడించాడు. చెన్నైలో తాను అంత మామూలు జీవితం గడిపానని అతనన్నాడు.

‘‘నాన్నగారు మమ్మల్ని మామూలుగా పెంచారు. స్టార్ హీరో పిల్లల్లాగే మేం పెరగలేదు. చెన్నైలో పెరగడం వల్ల మేం ప్రైవసీ కోల్పోలేదు. ఆటోల్లోనే తిరిగేవాళ్లం. స్కూల్లో కూడా మేం ఎవరో తెలియదు. సినిమాలకు వెళ్తే టికెట్ల కోసం క్యూల్లో నిలబడే వాడిని. చెన్నై దేవి థియేటర్లో సినిమా చూడటం అప్పట్లో చాలా గొప్పగా ఉండేది. రామ్ గోపాల్ వర్మ గారి రంగీలా సినిమాకు వెళ్తే టికెట్లు దొరక్కపోతే బ్లాక్ లో టికెట్ కొని వెళ్లాను. రజినీకాంత్.. కమల్ హాసన్ సినిమాలకు కూడా పరిస్థితి ఇలాగే ఉండేది’’ అని మహేష్ చెప్పాడు.

చిన్నపుడు తాను చిన్న చిన్న దొంగతనాలు కూడా చేశానని మహేష్ చెప్పడం విశేషం. ‘‘సినిమాలకు వెళ్లడం కోసం అప్పుడప్పుడూ అక్కయ్యల పర్సుల్లో డబ్బులు దొంగిలించేవాడిని. ఐతే తర్వాత వాళ్లకు నిజం చెప్పేవాడిని. ఇలా చెప్పేయడంతో ఆ విషయం అంత సీరియస్ అయ్యేది కాదు. అప్పుడప్పుడూ స్కూల్ కి బంక్ కొట్టి వెళ్లి చెన్నై బీచ్ లో కూర్చునేవాడిని. తర్వాత అన్నయ్యకు విషయం తెలిసి పెద్ద క్లాస్ పీకారు. సినిమా షూటింగుల కోసం చాలాసార్లు పర్మిషన్ తీసుకుని స్కూల్ మానేశాను’’ అని మహేష్ చెప్పాడు.