మహర్షిలో సీఈవో యాంగిల్ కూడా ఉందట!

Mon Sep 24 2018 10:59:07 GMT+0530 (IST)

మహేశ్ హీరోగా నటిస్తున్న మహర్షికి సంబంధించి కొత్త విషయం బయటకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ స్టూడెంట్ గా కనిపిస్తాడన్న విషయం చాలా పాతదే. యూత్ లుక్ లో ఇప్పటికే మనసును దోచేస్తున్న మహేశ్ పాత్రకు సంబంధించి మరో కోణం ఉందని చెబుతున్నారు.అశ్వనీదత్.. దిల్ రాజు.. పీవీపీ లాంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ రిషి పాత్రలో అలరించనుంటే.. రవి పాత్రలో అల్లరి నరేశ్ కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూట్ షెడ్యూల్ వచ్చే నెల 15న ప్రారంభం కానుంది.

దాదాపు పాతిక రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. మహర్షిలో స్టూడెంట్ పాత్రలో కనిపించే మహేశ్.. తాజా షెడ్యూల్ లో మాత్రం ఒక పెద్ద ఐటీ కంపెనీ సీఈవో దర్శనమిస్తారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సన్నివేశాల్ని అమెరికాలో తీయనున్నట్లు చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలతో పాటు.. రెండు పాటల్ని ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు.స్టూడెంట్ లుక్ తో అదరేసిన మహేశ్.. సీఈవో లుక్ తో కేక పుట్టించటం ఖాయమంటున్నారు.