Begin typing your search above and press return to search.

చిన్న సినిమా కోసం మహేష్, సమంత

By:  Tupaki Desk   |   8 Feb 2016 1:32 PM GMT
చిన్న సినిమా కోసం మహేష్, సమంత
X
ఈ రోజుల్లో ప్రమోషన్ అనేది చాలా కీలకం అయిపోయింది. ఎంత మంచి కంటెంట్ ఉన్నా ముందు సినిమా గురించి జనాలకు తెలియడం.. వారిలో ఆసక్తి రేగి థియేటర్లకు రావడం ముఖ్యం. ముందు జనాల్ని థియేటర్లకు రప్పించకుండా ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే చిన్న సినిమాల్ని కూడా డిఫరెంటుగా ప్రమోట్ చేయడానికి.. పెద్ద తారల సాయంతో వార్తల్లో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. మొన్నటిదాకా వార్తల్లో లేని ‘గుంటూరు టాకీస్’ బాలయ్య వచ్చి ట్రైలర్ లాంచ్ చేయగానే టాలీవుడ్ లో హాట్ టాపిగ్గా మారిపోయింది. ఇప్పుడిక మరో చిన్న సినిమా ‘క్షణం’కు కూడా బడా స్టార్ల అండ దొరుకుతోంది.

పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిట్ పెయిర్ మహేష్, సమంత సాయం చేయబోతున్నారు. ఈ నెల పదో తారీఖున ట్రైలర్ లాంచ్ కు వాళ్లిద్దరే ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. మహేష్, సమంత ప్రస్తుతం పీవీపీ బేనర్లోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ‘క్షణం’ మూవీని ప్రమోట్ చేయడానికి వాళ్లిద్దరికీ అభ్యంతరం లేకపోయింది. కొన్ని రోజుల కిందట బయటికి వచ్చిన ‘క్షణం’ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపాయి. ఓ చిన్నారి కిడ్నాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ఇది. అడివి శేష్, ఆదా శర్మ, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శేష్ కథ, స్క్రీన్ ప్లే కూడా అందించడం విశేషం. అతడి మిత్రుడు రవికాంత్ పేరెపు దర్శకుడు. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.