Begin typing your search above and press return to search.

మహేష్ బాబుతో మళ్లీ హారిస్ జైరాజ్

By:  Tupaki Desk   |   8 Oct 2015 1:30 PM GMT
మహేష్ బాబుతో మళ్లీ హారిస్ జైరాజ్
X
మహేష్ బాబు సినిమాల్లో మ్యూజిక్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మహేష్ సినిమా ఆడియో అంటే కచ్చితంగా ఏదో విశేషం ఉంటుందని ఆశిస్తారు అభిమానులు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటాడు మహేష్. ఒకప్పుడు వరుసగా మణిశర్మతోనే చేసేవాడు ప్రిన్స్. ఐతే మణి హవా తగ్గిపోయాక మ్యూజిక్ డైరెక్టర్లను మార్చడం మొదలుపెట్టాడు. మహేష్ లో ఈ మార్పు మొదలయ్యాక పని చేసిన తొలి మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్. ‘సైనికుడు’ సినిమాకు వాళ్లిద్దరూ కలిసి పని చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆడియో మాత్రం మంచి హిట్టయింది. ఇప్పటికీ ఆ సినిమాలో గోగోగో అదిగో - ఆడా పిల్లా అగ్గిపుల్లా - ఓరుగల్లుకే పిల్లా లాంటి పాటలు ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి.

‘సైనికుడు’ ఫ్లాప్ కావడం వల్ల హారిస్ తో మళ్లీ పని చేయలేకపోయిన మహేష్.. చాలా గ్యాప్ తర్వాత అతడితో జట్టు కట్టబోతున్నాడు. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాకు సంగీత దర్శకుడు హారిస్ జైరాజే. మురుగదాస్ - హారిస్ కాంబినేషన్ లో ఇంతకుముందు గజిని - సెవన్త్ సెన్స్ - తుపాకి లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాను మురుగదాస్ తమిళంలో విజయ్‌ తో, తెలుగులో మహేష్ బాబుతో వేర్వేరుగా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఆర్.బి.చౌదరి నిర్మాణంలో తెరకెక్కే ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారవలేదు.