వంద కోట్లు ఇచ్చినా ఎదురు చూపులే

Sat Dec 15 2018 14:48:54 GMT+0530 (IST)

ఒకప్పుడు దర్శకు డు ఎవరైనా కాని సినిమా బ్లాక్ బస్టర్ అయితే చాలు అతని దగ్గర కథ ఉందా లేదా వర్క్ అవుట్ అవుతుందా కాదా అని చెక్ చేసుకోకుండా అడ్వాన్సులు ఇచ్చేవారు. కథ పూర్తిగా సిద్ధం కాకపోయినా షూటింగ్ కు వెళ్లిపోయే సందర్భాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు. తమ మీద వందల కోట్ల వ్యాపారం ముడిపడి ఉండటంతో పాటు ఇమేజ్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా హీరోలు కథలను ఓకే చేయడంలో ఏ మాత్రం తొందరపడటం లేదు. సుకుమార్ రంగస్థలంతో వంద కోట్ల షేర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ కొట్టినా మహేష్ బాబు తో కథ విషయంలో ఎంతకీ ఏకాభిప్రాయం రావడం లేదు.  సుక్కు రెండు మూడు లైన్లు వినిపించినా మహేష్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరో వైపు త్రివిక్రమ్ తో చేసేందుకు రెడీ అవుతున్న అల్లు అర్జున్ కూడా ఇదే సమస్యను ఎదురుకుంటున్నాడు. ఆశించిన విధంగా కథ రాకపోతే డ్రాప్ అవ్వడానికి కూడా ప్రిపేర్ అయినట్టు గీత కాంపౌండ్ నుంచి వస్తున్న లీక్డ్ న్యూస్. అరవింద సమేత వీర రాఘవతో నూటా యాభై కోట్ల గ్రాస్ తెచ్చిన త్రివిక్రమ్ కు ఇది విచిత్రమైన పరిస్థితే. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. హీరోలు దర్శకుల ముందు తీసిన సినిమా రికార్డును చూసి తొందరపడటం లేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఆలస్యం జరిగి అభిమానుల అసంతృప్తికి దారి తీస్తున్నా లెక్క చేయడం లేదు.

ఒక్క పరాజయం ఎన్నో పాఠాలు నేర్పిస్తోంది. అందుకే మహేష్ అయినా అల్లు అర్జున్ అయినా ఒకే పంథాలో వెళ్తున్నారు. విజయ్ దేవరకొండ లాంటి హీరోలు సైతం ముందు ఒప్పుకున్నవి కాకుండా ఇక పై చేయబోయే ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్త వహిస్తూ ఒకటికి రెండుసార్లు కథలను వడపోత పొసే పని లో పడ్డారు. ఇది మంచి పరిణామమే. కాంబోల ఉచ్చులో పడి ప్రేక్షకులను మెప్పించలేక బయ్యర్లను నష్టపరిచే కంటే ఇది చక్కని ఫలితాలను ఇస్తుంది. కాకపోతే స్టార్ హీరోలు కాబట్టి అభిమానులు చాలా ఓపికతో ఎదురు చూడాల్సి వస్తుంది