మెలోడీ బ్రహ్మకు తగ్గ వారసుడే

Tue Jun 19 2018 11:24:23 GMT+0530 (IST)

ఓ పదిహేనేళ్ళు వెనక్కు వెళ్తే మణిశర్మ అనే పేరు సంగీత సంచలనం. అగ్ర హీరోలు ఇతని ట్యూన్స్ కోసం వేచి చూసే పరిస్థితి. ఇళయరాజా శకం ముగిసి కీరవాణి రాజ్ కోటిల ప్రభావం తగ్గుతున్న పరిస్థితుల్లో వాళ్లకు సరైన ప్రత్యాన్మాయంగా మణిశర్మ  నిలిచిన తీరు మ్యూజిక్ లవర్స్ ఎవరూ మర్చిపోలేరు. చిరంజీవి మొదలుకుని మహేష్ బాబు దాకా ప్రతి ఒక్కరికి హాట్ ఫెవరెట్ గా నిలిచిన మణిశర్మ దశాబ్దానికి పైగా ఏకచత్రాధిపత్యంగా ఏలాడన్న మాట అతిశయోక్తి కాదు. ఇప్పుడు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మను ప్రత్యేకంగా పిలిచే దర్శకులు ఎందరో. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు-టెంపర్ లాంటి సూపర్ హిట్స్ వెనుక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనితనం చాలా ఉంది.ఇప్పుడు ఈయన వారసుడు మహతి స్వర సాగర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ఆయనకు తగ్గ వారసుడు అనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఛలో సంగీత దర్శకుడు ఇతనే. అందులో చూసి చూడంగానే పాట సినిమా విడుదలకు ముందే మిలియన్ల వ్యూస్ దక్కించుకుని చాలా కాలం టాప్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

ప్రస్తుతం ఇతనికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఛలో అవుట్ ఫుట్ కి ఫిదా అయిపోయిన హీరో నాగ శౌర్య తమ ఐరా బ్యానర్ లో రూపొందుతున్న రెండో సినిమా @నర్తనశాలకు కూడా ఇతన్నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. దీంతో పాటు భవ్య క్రియేషన్స్ రూపొందించే ఒక మూవీ వారాహి తీయబోయే కొత్త ప్రాజెక్ట్ రెండూ మహతి అకౌంట్ లోనే పడ్డాయి.

దేవి శ్రీ ప్రసాద్-తమన్ తప్ప బలమైన మూడో ఆప్షన్ లేని టైం లో మహతి స్వర సాగర్ తానేంటో నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం. నాన్న మణిశర్మ కూడా కెరీర్ ను ఇదే విధంగా మొదలుపెట్టాడన్న విషయాన్నీ స్ఫూర్తిగా తీసుకుంటే సరి. తనయుడంటే మణికి వల్లమాలిన ప్రేమ. తన రికార్డింగ్ స్టూడియోను కూడా కొడుకు పేరు మీదే నడిపిస్తున్నాడు. ఇంకో రెండు మ్యూజికల్ హిట్స్ పడ్డాయి అంటే మహతి స్వర సాగర్ రేస్ లో దూసుకుపోవడం ఈజీనే. చేతిలో ఉన్నవి క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో మణిశర్మను అభిమానించే సంగీత ప్రేమికులు అదే కోరుకుంటున్నారు. పరిశ్రమకు వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఇప్పుడిప్పుడే తానేంటో ఋజువు చేసుకునే పనిలో మహతికి గోల్డెన్ టైం దగ్గర్లోనే ఉన్నట్టుంది. ఎవరైనా స్టార్ హీరో సినిమా పడితే దశ తిరిగేస్తుంది.