Begin typing your search above and press return to search.

ఆ వార్తలు నిజం కాదన్న మ్యాడీ

By:  Tupaki Desk   |   13 Dec 2018 5:39 AM GMT
ఆ వార్తలు నిజం కాదన్న మ్యాడీ
X
తమిళ స్టార్‌ మాధవన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. పలు తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చాలా కాలం తర్వాత సవ్యసాచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు డైరెక్ట్‌ గా వచ్చాడు. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సవ్యసాచి చిత్రంలో విలన్‌ పాత్రను చేశాడు. సవ్యసాచి చిత్రంలో మాధవన్‌ నటించడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. కాని సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక తాజాగా మాధవన్‌ మరో సినిమాకు ఓకే చెప్పాడనే వార్తలు వచ్చాయి.

రవితేజ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో మాధవన్‌ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. రవితేజ మూవీ కి మాధవన్‌ హైలైట్‌ అవుతాడని, రవితేజ కు మాధవన్‌ సక్సెస్‌ ను ఇస్తాడని రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం నిజమేనేమో అని అంతా భావించారు. కాని తాజాగా మ్యాడీ స్పందిస్తూ పుకార్ల పై క్లారిటీ ఇచ్చాడు. అవన్ని నిజం కాదని, పుకార్లే అంటూ కొట్టి పాడేశాడు.

రవితేజ మూవీ గురించి గత కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుసగా ఫ్లాప్‌ లను చవి చూస్తున్న రవితేజ తన తాజా చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే కాస్త ఆలస్యం అవుతోంది. ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా స్క్రిప్ట్‌ పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. మరో వైపు మాధవన్‌, అనుష్కల కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. రవితేజ మూవీలో మాత్రం మాధవన్‌ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది.