సందీప్ కిషన్.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్

Fri Aug 11 2017 10:23:44 GMT+0530 (IST)

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కొంత కాలంగా విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. కానీ అతడు ఆశించిన ఫలితాలు మాత్రం దక్కట్లేదు. ఈ ఏడాది వేసవిలో ‘నగరం’ అనే సినిమాతో పలకరించాడు సందీప్. అందులో అతను చాలా బాగా నటించాడు. సినిమా కూడా వెరైటీగా అనిపించింది. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల అది సరిగా ఆడలేదు. తమిళంలో మాత్రం ఈ చిత్రం సూపర్ హిట్టయింది. ఇక ఈ మధ్యే మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’తో పలకరించాడు సందీప్. అందులోనూ అతడి పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక తాజాగా విడుదలైన ‘నక్షత్రం’ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. అందులోనూ సందీప్ నటన ఆకట్టుకుంది. కానీ ఫలితమే తేడా కొట్టింది.

ఇప్పుడు సందీప్ ఆశలన్నీ తమిళ సినిమా ‘మాయవన్’ మీదే ఉన్నాయి. అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.వి.కుమార్ దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా ఇది. ఇంతకుముందు దీని టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఒక సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటే ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు సందీప్ ఇందులో. ఈ ట్రైలర్ తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా కనిపిస్తోందీ సినిమా. ట్రైలర్లోని కంటెంట్ తో పాటు దాన్ని కట్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంతోనే లావణ్య త్రిపాఠి తమిళ తెరకు పరిచయం కాబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రాజెక్ట్ జడ్’ పేరుతో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా అయినా సందీప్ కు తెలుగులో సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.