Begin typing your search above and press return to search.

కోహ్లి ఎలా కెప్టెన్ అయ్యాడో తెలిస్తే షాకే..

By:  Tupaki Desk   |   29 Sep 2016 11:57 AM GMT
కోహ్లి ఎలా కెప్టెన్ అయ్యాడో తెలిస్తే షాకే..
X
విరాట్ కోహ్లి కెప్టెన్ ఎలా అయ్యాడంటే.. తన ఆటతో - నాయకత్వ లక్షణాలతో అంటారు ఎవరైనా. కానీ అతను ఆటగాడిగా రాణించి.. కెప్టెన్‌ గా ఎదగడానికి తానే కారణం అంటున్నాడు స్పిరుచువల్ లీడర్ గుర్మీత్ రామ్ రహీం సింగ్. ఈయనెవరో నార్త్ ఇండియన్ జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. మన దగ్గరున్న బాబాల తరహాలో తనను తాను దేవుడిగా ప్రకటించుకుని భారీ సభలు పెడుతుంటాడు గుర్మీత్ సింగ్. అతడికి కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న మాట కూడా వాస్తవం.

ఐతే ఈ మధ్య గుర్మీత్ ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ పేరుతో తన మీద తాను సినిమాలు కూడా తీసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు సినిమాలు వచ్చాయి. తాజాగా మూడో భాగం.. ‘ఎంఎస్జీ: ది వారియర్ లయన్ హార్ట్’ దసరా కానుకగా రాబోతోంది. ఈ చిత్రం హిందీతో పాటు పంజాబీ.. తెలుగు.. తమిళం.. మలయాళ భాషల్లోనూ రిలీజవుతోంది.

ఈ సందర్భంగా తెలుగు వెర్షన్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన గుర్మీత్.. కోహ్లి సహా చాలామంది ఇండియన్ క్రికెటర్లు తన దగ్గరికి సాయం కోసం వచ్చినట్లు చెప్పాడు.‘‘2010లో కోహ్లి.. నెహ్రా.. ధావన్.. అమిత్ మిశ్రా.. మరికొంత మంది క్రికెటర్లు నా దగ్గరికి వచ్చారు. 30-40కి మించి పరుగులు చేయలేకపోతున్నామని (నెహ్రా.. మిశ్రా బౌలర్లన్న సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం) బాధపడ్డారు. నేను వాళ్లకు కొన్ని సూచనలు ఇచ్చాను. తర్వాత అందరూ బాగా ఆడారు. అందులో ఒకరు ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్’’ అంటూ కోహ్లి గాడిన పడి కెప్టెన్ కావడానికి పరోక్షంగా తనే కారణమని చెప్పకనే చెప్పాడు గుర్మీత్.

ఇక తన బహుముఖ ప్రతిభ గురించి గుర్మీత్ చెబుతూ.. ‘‘నేను 32 స్పోర్ట్స్ ఆడగలను. నేను చిన్నప్పట్నుంచి అనేక వ్యాయామాలు చేసేవాడిని. నేను ఆటగాళ్లను ట్రైన్ చేస్తుంటా. నటనలో నేనెప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఒక సీన్ పూర్తి చేయగానే.. నేను ఆర్ట్ డైరెక్షన్.. మ్యూజిక్ లాంటి వేరే విభాగాల్లోకి వెళ్లిపోతా. ఆ పని చేస్తా. మామూలు మనుషులకు ఇది సాధ్యం కాదు. నేను ఐదేళ్ల వయసు నుంచే గురు మంత్ర సాధన చేస్తున్నాను కాబట్టే ఇది సాధ్యమైంది’’ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/