Begin typing your search above and press return to search.

సల్మాన్ కు షాకిచ్చిన ఎంఎన్ ఎస్!

By:  Tupaki Desk   |   1 Oct 2016 4:44 AM GMT
సల్మాన్ కు షాకిచ్చిన ఎంఎన్ ఎస్!
X
యుడీ ఉగ్రదాడి అనంతరం ఇండియా - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒకవైపు ఫుల్ గా పెరిగిపోతూ ఉంటే... మరో వైపు దానికి ఏమాత్రం తగ్గకుండా పాక్ నటులే టార్గెట్ గా ముంబైలో ఉద్రిక్తతలను పెంచుతోంది మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ ఎస్). ఇదే సమయంలో ఇండియాలో పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించింది ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఈ విషయంపై తాజాగా సల్మాన్ స్పందించి, ఆ విషయాన్ని ఖండిస్తూ... వారంతా వర్క్ పర్మిట్లు తీసుకుని ఇండియా వచ్చారని తెలిపారు. అయితే సల్మాన్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ ఎస్) స్పందిస్తూ, తీవ్ర హెచ్చరికలు చేసింది.

చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదని.. టూరిస్ట్ వీసా మీద భారత్ కు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని.. ఇది పూర్తిగా చట్టవ్యతిరేక చర్య అని.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం అని స్పందించిన ఎంఎన్ ఎస్ కీలక నేత అమేయ్ ఖోపర్... " ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఎలాగూ జరుగుతుంది, కానీ ఇప్పటికిప్పుడు మాత్రం పాకిస్థానీ నటులు ఎక్కడకనిపించినా దాడులు చేస్తాం.. పాక్ నటుల సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటాం" అని ప్రకటించారు.

ఇదే క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ రెండు రోజుల అల్టిమేటం జారీచేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే మరోసారి అదే అంశంపై స్పందించారు. అయితే ఈసారి ఆయన బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్‌ కు గట్టి వార్నింగే ఇచ్చారు. మన దేశంలో నటీనటుల కొరత ఉందా? అని ప్రశ్నించిన రాజ్ ఠాక్రే... అసలు పాకిస్థానీ నటులు మన సినిమాల్లో పనిచేయాల్సిన అవసరం ఏముందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. మన కోసం సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న వాళ్లంతా ఆయుధాలు కింద పడేస్తే ఏమవుతుంది... సరిహద్దులను కాపాడేది సల్మాన్ ఖానా అని ప్రశ్నించారు. (సల్మాన్ ని ఉద్దేశించి) వాళ్లకు మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ల సినిమాలను కూడా నిషేధిస్తాం అని ప్రకటించారు.

కాగా, ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నానని పేర్కొన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్... ఇండియాలో పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించడం సరికాదని, ఈ మేరక్ నిషేధం విధించిన నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుపట్టారు. "ఉడీ సైనిక స్థావరంపై దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులే కదా, పాకిస్థానీ కళాకారులైతే కాదుకదా! అలాంటప్పుడు పాక్ నటులపై నిషేధం ఎందుకు?" అని ప్రశ్నించాడు. ఇదే సమయంలో వారంతా ఉగ్రవాదులు కాదు, ఇండియాలో పనిచేసేందుకు వీసాలు, వర్క్ పర్మిట్లు తీసుకుని వచ్చారని ప్రకటించారు! ఈ వ్యాఖ్యలపైనే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సల్మాన్ కు కౌంటర్ ఇచ్చింది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/