Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘ఎం.ఎస్.ధోని’

By:  Tupaki Desk   |   1 Oct 2016 6:47 AM GMT
మూవీ రివ్యూ : ‘ఎం.ఎస్.ధోని’
X
చిత్రం : ‘ఎం.ఎస్.ధోని’

నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - అనుపమ్ ఖేర్ - భూమిక చావ్లా - దిశా పటాని - కియారా అద్వాని - రాజేశ్ శర్మ తదితరులు
సంగీతం (పాటలు): అమాల్ మాలిక్ - రోచక్ కోహ్లి
నేపథ్య సంగీతం: సంతోష్ తుండియల్
నిర్మాణం: అరుణ్ పాండే - ఫాక్స్ స్టార్ స్టూడియోస్
కథ - స్క్రీన్ ప్లే: నీరజ్ పాండే - దిలీప్ ఝా
దర్శకత్వం: నీరజ్ పాండే

బాలీవుడ్లో గత కొన్నేళ్లుగా స్పోర్ట్స్ బయోపిక్స్ హవా సాగుతోంది. అందులో ఎక్కువగా కెరీర్ ముగించిన వాళ్ల కథలే వచ్చాయి. ఐతే ఇప్పుడు ఇంకా క్రికెట్లో కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని మీద సినిమా వచ్చేసింది. చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి ఇండియన్ గ్రేటెస్ట్ ఎవర్ క్రికెటర్ కమ్ కెప్టెన్లలో ఒకడిగా ఎదిగిన ధోనిపై తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ మీద మొదట్నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఇక గత నెల రోజుల్లో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. మరి ధోని సినిమా.. ఆ అంచనాల్ని అందుకునేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

జార్ఖండ్ రాజధాని రాంచిలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ధోని.. తన బాల్యంలో ఎలా ఉండేవాడు.. అతను క్రికెట్లోకి ఎలా వచ్చాడు.. ఎలా ఎదిగాడు.. ఈ క్రమంలో అతడికి ఎలాంటి ఒడుదొడుకులు ఎదురయ్యాయి.. రైల్వే టీటీగా ఉద్యోగం చేస్తున్నవాడు అంతర్జాతీయ క్రికెట్ వైపు ఎలా మళ్లాడు.. ఆ తర్వాత భారత జట్టులో ఎలా పేరు సంపాదించాడు.. కెప్టెన్ అయి జట్టును ఎలా నడిపించి.. 2011 వన్డే ప్రపంచకప్ లో భారత్ ను ఎలా గెలిపించాడు.. ఈ అంశాలన్నింటినీ స్పృశిస్తూ సాగుతుంది ‘ఎం.ఎస్.ధోని’ కథ.

కథనం - విశ్లేషణ:

‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ని ఒక సినిమాగా చూడలేం. ఇదొక జీవితం. ధోని జీవితంలోని ఒక పాజిటివ్ కోణాన్ని స్ఫూర్తిదాయకమైన రీతిలో చూపించే ప్రయత్నం చేశాడు నీరజ్ పాండే. ఈ చిత్రాన్ని బయోపిక్ అనడం కంటే కూడా ధోని క్రికెట్ కెరీర్ విశ్లేషణగా చెప్పొచ్చు. ఐతే దాన్ని డాక్యుమెంటరీలా కాకుండా భావోద్వేగాల్ని జోడించి.. హృద్యంగా చెప్పడంలో నీరజ్ పాండే తన ప్రత్యేకత చూపించాడు. ఐతే ధోని సినిమా చూసేముందు ఒక ముఖ్యమైన షరతు ఏంటంటే.. క్రికెట్ మీద ఆసక్తి ఉండాలి. లేకుంటే కష్టం. ధోని అభిమానుల్ని ఎలాగూ ఈ సినిమా ఆద్యంతం అలరిస్తుంది కానీ.. అతణ్ని వ్యతిరేకించేవారు సైతం ‘ఎం.ఎస్.ధోని’ని చూస్తూ అందులోని ఎమోషన్ కు కనెక్టవడానికి అవకాశం ఉంది.

ధోని కేవలం కెప్టెన్ గా భారత జట్టుకు విజయాలందించడం వల్లో.. ప్రపంచకప్ ఫైనల్లో జట్టును గెలిపించడం వల్లో గొప్పవాడు అయిపోలేదు. ఆటతో పాటు అతడి వ్యక్తిత్వమూ అతణ్ని గొప్పవాణ్ని చేసింది. మిగతా క్రికెటర్లతో పోలిస్తే విలక్షణ వ్యక్తిత్వం.. నేపథ్యం ధోని జీవితాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ రెండు విషయాలపై నీరజ్ పాండే ప్రధానంగా దృష్టిపెట్టాడు. ధోని ఎలాంటి పరిస్థితుల నుంచి క్రికెట్ వైపు వచ్చాడు.. ఎలా ఎదిగాడు.. ఆ క్రమంలో అతడికి ఎదురైన అడ్డంకులు.. మానసిక సంఘర్షణ.. ఇలాంటి అంశాలన్నింటినీ హృదయాలకు హత్తుకునేలా.. భావోద్వేగభరితంగా చెప్పడంలో నీరజ్ పాండే ప్రతిభ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ధోని బాల్యం.. క్రికెట్ కెరీర్ సాగిన తీరును సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగా చూపించినప్పటికీ అవి బోరింగ్ గా... బయోగ్రఫీ చదువుతున్నట్లుగా ఏమీ అనిపించవు.

ధోని కుటుంబం.. అతడి చుట్టూ వాతావరణం.. అతడి జీవితంలోని వ్యక్తుల్ని.. సంఘటనల్ని అత్యంత సహజంగా తెరమీదికి తీసుకురావడంలో.. అన్నింటితో ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేయడంలో నీరజ్ విజయవంతమయ్యాడు. దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశం కోల్పోయి.. రైల్వే టీటీగా ఉద్యోగంలో చేరి.. ఇటు క్రికెట్ ఆడలేక.. అటు ఇష్టం లేని ఉద్యోగంలో కొనసాగలేక ధోని పడిన మానసిక సంఘర్షణను చూపిస్తూ సాగే ఎపిసోడ్ ను ‘ఎం.ఎస్.ధోని’ సినిమాలో ప్రత్యేకమైందిగా చెప్పొచ్చు.

మామూలుగా ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు ఎంతైనా స్వేచ్ఛ తీసుకోవచ్చు. తన క్రియేటివిటీ ఎంతైనా చూపించొచ్చు. ఎంతైనా మసాలా అద్దొచ్చు. కానీ బయోపిక్స్ లో ఆ అవకాశం ఉండదు. చాలా వరకు వాస్తవాలే చూపించాలి. కానీ ఆ వాస్తవాల్లో అంత ప్రత్యేకంగా ఏమీ కనిపించకపోవచ్చు. ఉన్నదున్నట్లు చూపిస్తే ప్రేక్షకుడిలో ఎమోషన్ రాకపోవచ్చు. ఐతే ఉన్నదాన్నే ప్రభావవంతంగా.. స్ఫూర్తిదాయకంగా చెప్పడం అన్నది సవాలుతో కూడుకున్న విషయం. ఇక్కడే నీరజ్ పాండే ప్రత్యేకత కనిపిస్తుంది. ధోని ఉద్యోగంలో చేరి.. అందులో సంఘర్షణ ఎదుర్కొనే ఎపిసోడ్ ను భావోద్వేగభరితంగా తెరకెక్కించాడు నీరజ్. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు అతడు అంతర్మథనానికి గురై.. తన గమ్యాన్ని మార్చుకునే సన్నివేశాన్ని తీర్చిదిద్దిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ధోని నేపథ్యం.. అతను క్రికెట్లోకి రావడం.. బ్యాట్స్ మన్ గా అందరి దృష్టిలో పడటం.. ఉద్యోగ జీవితంలో అతడి అనుభవాలు.. ఇవన్నీ మనకు తెలియని విషయాలే కాబట్టి ప్రథమార్ధం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఐతే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ విశేషాలన్నీ మనకు చాలావరకు తెలిసినవే కాబట్టి.. వాటి నేపథ్యంలో సాగే ద్వితీయార్ధం అంత ఆసక్తికరంగా అనిపించదు. పైగా దీనికి రెండు రొమాంటిక్ ట్రాక్స్.. పాటలు కూడా జోడించారు. దీంతో ద్వితీయార్దం నిరాశ పరుస్తుంది. ఐతే 2011 ప్రపంచకప్ తాలూకు అనుభూతుల్ని గుర్తు చేస్తూ సాగే పతాక సన్నివేశాల్లో క్రికెట్ ప్రియులందరికీ ఒకరకమైన ఉద్వేగం కలుగుతుందనడంలో సందేహం లేదు.

లేని పోని వివాదాలెందుకు.. ఎవరినీ నొప్పించకూడదు అని బలంగా నిర్ణయించుకున్నట్లున్నారు.. సినిమాలో ఎక్కడా వివాదాల జోలికి వెళ్లలేదు. ధోని కెరీర్లోని ఫెయిల్యూర్లను కానీ.. వ్యక్తిగతంగా అతడిలోని ఏ చిన్న నెగెటివ్ కోణాన్ని కానీ సినిమాలో చూపించలేదు. దీని వల్ల సినిమా వన్ డైమన్షనల్ అయిపోయింది. ఫ్లాట్ గా సాగుతుంది. ఇవన్నీ కూడా చూపించి ఉంటే.. సినిమా సంపూర్ణంగా అనిపించేది. అలాగే ధోని వ్యక్తిత్వపు లోతుల్లోకి కూడా ఈ సినిమా వెళ్లలేదు. చిన్న వయసులోనే అతడికి అంత పరిణతి ఎలా వచ్చింది.. ఒత్తిడి సమయాల్లో ఎలా అంత ప్రశాంతంగా ఉంటాడు.. లాంటి విషయాల్ని చర్చించలేదు.

హెలికాఫ్టర్ షాట్ ఎవరి దగ్గరో నేర్చుకున్నట్లు చూపించడం.. ధోనిలోని రొమాంటిక్ కోణాన్ని కూడా బయటపెట్టడం లాంటివి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇలాంటి విషయాలపై ఓపెన్ అయినందుకు ధోనిని అభినందించాలి. క్రీడల విషయంలో మన దృక్పథం ఎలా ఉండాలనే విషయంలో ఇటు తల్లిదండ్రులకు.. అటు పిల్లలకు ‘ఎం.ఎస్.ధోని’ స్ఫూర్తిగా నిలుస్తుంది. క్రికెట్ అనే కాదు.. క్రీడల మీద ఆసక్తి ఉన్నవాళ్లందరికీ ‘ఎం.ఎస్.ధోని’ కచ్చితంగా మంచి అనుభూతే ఇస్తుంది. ఒక సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. ఈ సినిమాలోని ఎమోషన్ కు కనెక్టయితే నిడివి 3 గంటలకు పైగా ఉండటం పెద్ద విషయమేమీ కాదు. అలా కాని పక్షంలో అయితే మాత్రం మధ్యలోనే థియేటర్ల నుంచి వచ్చేయడం ఖాయం.

నటీనటులు:

సినిమాకు సగం బలం ఒరిజినల్ ధోని జీవితం అయితే.. సగం బలం ఆ పాత్ర పోషించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అతను ధోనిలా నటించలేదు. ధోనిలాగా జీవించాడు. ఒక ఊహాజనిత పాత్రను చేయడం వేరు. మరో వ్యక్తిలా కనిపించడం వేరు. సుశాంత్ ఎంత కష్టపడ్డాడో.. ఏమేం చేశాడో కానీ.. ధోని పాత్రలోకి అతను ఒదిగిపోయిన తీరుకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ధోనీలా నడవడం.. ధోనీలా భుజాలు ఆడించడం.. ధోనీలా షాట్లు ఆడటం మాత్రమే కాదు.. ధోనీలాగా అంతర్ముఖుడిలా కనిపించడంలోనూ సుశాంత్ తనదైన ముద్ర వేశాడు. ధోనీలా సుశాంత్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ధోని తండ్రిగా అనుపమ్ ఖేర్.. కోచ్ గా రాజేశ్ శర్మ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఏకే గంగూలీ పాత్రలో కనిపించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. యువరాజ్ సింగ్ పాత్రలో కనిపించిన నటుడు డిట్టో అతడిలాగే ఉన్నాడు. ఈ పాత్ర కనిపించినపుడు భలేగా ఉంటుంది. భూమిక చావ్లా బాగా చేసింది. మిగతా నటీనటులందరూ కూడా ఓకే.

సాంకేతికవర్గం:

‘ఎం.ఎస్.ధోని’ సినిమాకు నేపథ్య సంగీతం.. ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణ. పాటలు ఏదో అలా వచ్చి వెళ్లిపోతాయి. పైగా తెలుగు డబ్బింగ్ లో వాటిని వినడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక పాటను తెలుగులోకి అనువదించకుండా తమిళంలోనే ఉంచేయడంలో ఆంతర్యమేంటో? సంజయ్ చౌదరి నేపథ్య సంగీతం సినిమాను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సంతోష్ తుండియాల్ ఛాయాగ్రహణం కూడా గొప్పగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. ఏదీ కృత్రిమంగా అనిపించకుండా సినిమా అంతా సహజంగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టు అయిన నీరజ్ పాండే.. ధోని సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. ఎన్నో పరిమితుల మధ్య ఈ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.

చివరగా: ఎం.ఎస్.ధోని.. ఇది సినిమా కాదు.. జీవితం!

రేటింగ్- 3.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre