నెట్లో హీరోయిన్ల కామకథలు

Sat May 19 2018 10:35:35 GMT+0530 (IST)

బాలీవుడ్ కొత్త ప్రయోగాలకు రెడీగానే ఉంటుంది. నిన్న మొన్నటివరకు ఎరోటిక్ సినిమాల ట్రెండ్ నడిచింది. ప్రేమ.. పగ.. సెక్స్.. ఈ అంశాల చుట్టూ ఈ సినిమాలు నడిచేవి. ఇప్పుడలాంటి సినిమాలకు క్రేజ్ తగ్గింది. దీంతో ప్రేమ కథలను తలదన్నే కామకథలతో ప్రేక్షకులకు మెప్పించడానికి రెడీ అయ్యారు. కాకుంటే రెగ్యులర్ సినిమా రూపంలో కాదు... నెట్ మూవీ రూపంలో.లస్ట్ స్టోరీస్ పేరుతో వస్తున్న ఈ నెట్ మూవీని ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ నెట్ ఫ్లిక్స్ ప్రజంట్ చేస్తోంది. నలుగురు టాప్ డైరెక్టర్లు కలిసి నలుగురు హీరోయిన్లతో ఈ నెట్ సిరీస్ తీస్తున్నారు. రాధికా ఆప్టే - భూమి పెడ్నేకర్ - మనీషా కొయిరాలా - కియారా అద్వానీ ఈ లస్ట్ స్టోరీస్ లో హీరోయిన్లుగా నటిస్త్తున్నారు. కరణ్ జోహార్ - అనురాగ్ కాశ్యప్ - జోయా అఖ్తర్ - దిబాకర్ బెనర్జీ లస్ట్ స్టోరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా దీని ట్రయిలర్ రిలీజ్ చేశారు.

లెజెండ్ ఫేం హీరోయిన్ రాధికా ఆప్టే ఇందులో ప్రొఫెసర్ గా నటిస్తోంది. భర్తతో సరిపడక తన స్టూడెంట్ ఒకరితో అఫైర్ పెట్టుకుంటుంది. ఈమె కథను అనురాగ్ కాశ్యప్ డైరెక్ట్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ మూవీ టాయిలెట్ లో హీరోయిన్ గా నటించిన భూమి పెడ్నేకర్ ఓ దిగువ మధ్య తరగతి మహిళ పాత్ర చేస్తోంది. ఈమె తన ఇంటి ఓనర్ కొడుకుతో సంబంధం మెయిన్ టెయిన్ చేస్తుంది. ఈమె కథను జోయా అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక కరణ్ జోహార్ మహేష్ హీరోయిన్ కియారా అద్వాని కథను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈమె కొత్తగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన మహిళ కథ ఇది. మనసులో ఒకరిని పెట్టుకుని భర్తతో గడిపే పాత్ర చేస్తోంది.  చివరగా దిబాకర్ బెనర్జీ మనీషా కొయిరాలా కథను డైరెక్ట్ చేస్తున్నాడు. భర్త స్నేహితుడిపై మనసు పారేసుకునే వైఫ్ క్యారెక్టర్ ఆమెది.

వేగంగా మారుతున్న అర్బన్ లైఫ్ లో కుటుంబంలో భార్యాభర్తల మధ్య రిలేషన్స్ ఎలా మారిపోతున్నాయో ఈ నెట్ మూవీలో ఆసక్తికరంగా చిత్రీకరించారు. నెట్ మూవీ కావడంతో సెన్సార్ అడ్డంకులేమీ కావు. కాబట్టి కాస్త బోల్డ్ గానే ఈ లస్ట్ స్టోరీస్ ఉంటాయి. కామకథలని పేరులోనే స్పష్టంగా చెప్పేశారు కాబట్టి శృతి మించిన శృంగారారానికి లోటేం ఉండకపోవచ్చు. జూన్ 15 నుంచి ఈ లస్ట్ స్టోరీస్ నెట్ ఫ్లిక్స్ లో చూసేయొచ్చు.