Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘లవర్’

By:  Tupaki Desk   |   20 July 2018 9:12 AM GMT
మూవీ రివ్యూ: ‘లవర్’
X
చిత్రం : ‘లవర్’

నటీనటులు: రాజ్ తరుణ్ - రిద్ధి కుమార్ - సచిన్ ఖేద్కర్ - రాజీవ్ కనకాల - రోహిణి - జీవా - రాజా రవీంద్ర - ప్రవీణ్-సత్య - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్ - అంకిత్ తివారి - ఆర్కో- రిషి రిచ్ - అజయ్ వ్యాస్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: హరీష్ రెడ్డి
రచన - దర్శకత్వం: అనీష్ కృష్ణ

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. ఈసారి ‘లవర్’ అవతారమెత్తాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు బేనర్లో ఈ చిత్రం తెరకెక్కడం.. ‘అలా ఎలా’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించడంతో ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రమైనా రాజ్ తరుణ్ రాత మార్చేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

రాజ్ (రాజ్ తరుణ్) కస్టమైజ్డ్ ఫొటో బైక్ లు తయారు చేసే ఆర్టిస్టిక్ మెకానిక్. అతడికి చిన్న యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చేరినపుడు అక్కడ నర్స్ అయిన చరిత (రిద్ధి కుమార్)ను చూసి ప్రేమలో పడతాడు. ముందు ఆమెకు రాజ్ అంటే నచ్చకపోయినా.. తర్వాత ఆమె కూడా అతడి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో రిద్ధి ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. తాను పని చేసే ఆసుపత్రిలో జరుగుతున్న ఓ కుట్రను బయటపెట్టాలని చూడటంతో ఆమెను కొందరు టార్గెట్ చేస్తారు. ఇంతకీ ఆ కుట్ర ఏంటి.. చరితను టార్గెట్ చేసిందెవరు.. వాళ్ల నుంచి చరితను రాజ్ ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కోరుకుంటున్నారు ప్రేక్షకులు ఈ రోజుల్లో. ఏదో ఒక ప్రత్యేకత లేకుంటే.. స్ట్రైకింగ్ పాయింట్ లేకుంటే ప్రేక్షకులకు రుచించట్లేదు. ఈ విషయం మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉన్నప్పటికీ చాలా సాదారణమైన.. కొత్తదనం లేని కథలతో దర్శకులు మళ్లీ మళ్లీ సాహసాలు చేస్తూనే ఉన్నారు. ‘అలా ఎలా’ లాంటి ఫన్నీ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన అనీష్ కృష్ణ.. ‘లవర్’తో అలాంటి సాహసమే చేశాడు. ఇందులో కథ ఏమాత్రం కొత్తగా అనిపించదు. వందల సార్లు చూసిందే. కథనంలోనూ ఏమంత వైవిధ్యం లేదు. కాకపోతే దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత బేనర్లో తెరకెక్కిన సినిమా కావడంతో సాంకేతిక ఆకర్షణలు మాత్రం బాగా కుదిరాయి. వీనుల విందైన సంగీతం.. ఆహ్లాదం పంచే కెమెరా పనితనం.. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు కొంత అందం తెచ్చాయి. కానీ అసలు సమస్యల్లా రొటీన్ గా అనిపించే కథాకథనాలతోనే. మరీ తీసిపడేసేట్లు లేకుండా సోసోగా సాగిపోయే సన్నివేశాలతో సాగిపోయే ఈ చిత్రం ఏదో అలా టైంపాస్ చేయడానికైతే ఓకే అనిపిస్తుంది. అంతకుమించిన ప్రత్యేకత ఏమీ లేదిందులో.

ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపేసే హీరో.. అనుకోకుండా హీరోయిన్ కనిపించగానే ఫ్లాట్ అయిపోయి ఆమె వెంట పడి అల్లరి చేస్తుంటాడు. హీరోయిన్ అతడిని లైట్ తీసుకుంటుంది. కానీ ఒక సందర్భంలో హీరో చేసిన మంచి పనికి ఫ్లాట్ అయిపోతుంది. ఇద్దరూ కలిసి డ్యూయెట్లు వేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ కు ఒక పెద్ద సమస్య వస్తుంది. దాన్ని హీరో పరిష్కరించి కథను సుఖాంతం చేస్తాడు. ఎన్ని వందల సినిమాల్లో చూసి ఉంటాం ఇలాంటి కథల్ని? యాక్సిడెంట్ అయి ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి హీరో స్యూరిటీ సంతకం పెట్టాడని హీరోయిన్ ప్రేమలో పడిపోవడం లాంటి సన్నివేశాన్ని ఈ రోజుల్లో కూడా సినిమాల్లో పెడుతున్నారంటే ఏం చెప్పాలి? దీన్ని బట్టే ‘లవర్’లో హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ ఎలా నడుస్తుందో ఒక అంచనాకు వచ్చేయొచ్చు. ‘అలా ఎలా’లో వినోదాన్ని పండించడంలో తనదైన ముద్ర చూపించిన అనీష్ కృష్ణ తన రెండో సినిమాలో మాత్రం ఆ విషయంలో నిరాశ పరిచాడు. హీరో అతడి స్నేహితులతో కామెడీ కోసం చేయించిన ప్రయత్నం పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఇటు రొమాంటిక్ ట్రాక్.. అటు కామెడీ రెండు సాధారణంగా ఉండటంతో ప్రథమార్ధంలో ఏ ప్రత్యేకతా లేకపోయింది. పాటలు, దృశ్యాలు మాత్రం కనువిందు చేస్తాయి.

ఐతే ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో ‘లవర్’ మెరుగ్గా అనిపిస్తాడు. ఇందుకు కేరళ నేపథ్యం ప్రధాన కారణం. సన్నివేశాల్లో కావచ్చు.. పాటల్లో కావచ్చు.. అక్కడి వాతావరణాన్ని చాలా అందంగా చూపిస్తూ ఆహ్లాదం పంచారు. మలయాళీ అయిన హీరోయిన్ ఇంట్లో సాగే దృశ్యాలు సరదాగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలోనే కథ కొంచెం ముందుకు కదులుతుంది. విలన్ల వ్యవహారం కూడా పర్వాలేదనిపిస్తుంది. ‘ఒక్కడున్నాడు’ సినిమాను గుర్తుకు తెచ్చేలా విలన్ పాత్రను తీర్చిదిద్దాడు అనీష్ కృష్ణ. కానీ అక్కడిలా ఇందులో ఉత్కంఠ ఏమీ ఉండదు. సచిన్ ఖేద్కర్ లాంటి నటుడిని పూర్తిగా వేస్ట్ చేసేశారు. ఆయన పాత్ర పరిచయం చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. తర్వాత దాన్ని తేల్చేశారు. విలన్ ఎపిసోడ్ కు సంబంధించి గొప్ప మలుపులేమీ ఉండవు. ఐతే చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చి కథకు ముగింపునిచ్చారు. అది మిశ్రమ అనుభూతిని కలిగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ‘లవర్’ సోసోగా సాగిపోయే ఒక టైంపాస్ లవ్ స్టోరీ. రాజ్ తరుణ్ గత సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ గా అనిపిస్తుంది.

నటీనటులు:

రాజ్ తరుణ్ లుక్ మార్చినా నటన ఎప్పట్లాగే అనిపిస్తుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉత్సాహంగా నటించాడు. లవర్ పాత్రకు అతను బాగానే సూటయ్యాడు. తన ప్రేయసి కోసం తపించే చివరి అరగంటలో రాజ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ రిద్ధి కుమార్ తాజాగా.. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అందం.. నటన పర్వాలేదు. ఈ సినిమా వరకు ఓకే అనిపిస్తుంది కానీ.. ఆమెలో హీరోయిన్ ఫీచర్స్ తక్కువే. సచిన్ ఖేద్కర్ లాంటి నటుడిని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారు. రాజీవ్ కనకాల చాలా బాగా చేశాడు. అజయ్ ఓకే. హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి ఆకట్టుకుంటుంది. ఇక హీరో స్నేహితులుగా ప్రవీణ్.. సత్య పెద్దగా చేసిందేమీ లేదు. రాజా రవీంద్ర.. జీవా.. వీళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

‘లవర్’కు అతి పెద్ద అస్సెట్ సంగీతమే. ఐదుగురు సంగీత దర్శకులు కలిసి అందించిన పాటల్లో చాలా వరకు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ‘నాలో చిలిపి కల’ వీనుల విందు చేస్తుంది. దాని తాలూకు థీమ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాటలూ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. సమీర్ రెడ్డి ఛాయాగ్రణం సినిమాకు మరో పెద్ద ఆకర్షణ. ముఖ్యంగా కేరళ ఎపిసోడ్లో ప్రతి దృశ్యం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చిన్న సినిమా అని చూడకుండా బాగా ఖర్చు పెట్టి సినిమాను రిచ్ గా తీర్చిదిద్దాడు నిర్మాత హర్షిత్ రెడ్డి. ఇక దర్శకుడు అనీస్ కృష్ణ అంచనాల్ని అందుకోలేకపోయాడు. తొలి సినిమాకు సింపుల్ కథను ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పడం ద్వారా అనీష్ ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఈసారి తన బలమైన వినోదాన్ని అతను విడిచిపెట్టాడు. సన్నివేశాల్ని కొంచెం ప్లెజెంట్ గా తీర్చిదిద్దడంలో మినహాయిస్తే అనీష్ ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు.

చివరగా: లవర్.. కొత్తగా ఏమీ లేడు

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre