చిట్టీ 2.O ప్రేమలో ఎమీ

Thu Nov 15 2018 21:13:03 GMT+0530 (IST)

యంత్రుడా .. ఓ మరమనిషీ.. నీకు ప్రాణం వస్తే .. మనసు అనేది ఒకటుంటే.. నీలోనూ ప్రేమ పుడితే.. దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్టుతో `రోబో` చిత్రాన్ని రూపొందించారు శంకర్. బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించింది. ఏవో కొన్ని వైర్లు పరికరాలతో రూపొందించిన రోబోట్కి ప్రాణం పోసి.. హృదయం మొలిపించి.. చివరికి ఆ రోబోకి పురుడు పోయించే నైపుణ్యం కూడా కల్పించి..  అద్భుతమైన బాక్సాఫీస్ వండర్ని క్రియేట్ చేయగలిగాడు. మరమనిషి గుండెలోనూ కన్నెపిల్ల ప్రేమ మొలకెత్తితే ఆ పర్యవసానం ఎంతటి భయానక భీభత్సంగా ఉంటుందో తెరపై ప్రత్యక్షంగానే చూపించాడు. అసాధారణ యాక్షన్ విన్యాసాలతో కళ్లు మిరుమిట్లు గొలిపే విజువల్స్ తో కట్టిపడేశాడు.దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వచ్చింది రోబో. ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమా కంటే పదింతల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న 2.ఓ చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనన్న ఉత్కంఠ అభిమానుల్ని నిలవనీయడం లేదు. చిట్టీ ఈజ్ బ్యాక్.. క్రోమ్యాన్తో చిట్టీ విరోచిత పోరాటాల్ని తెరపై చూడండి అంటూ ఇప్పటికే 2.ఓ టీమ్ ప్రచారం చేస్తోంది. ఈ సినిమా మేకింగ్ వీడియోల్లో చిట్టీతో పాటు లేడీ రోబోట్ ఎమీజాక్సన్ పాత్ర ఎలా ఉంటుందో ఎలివేట్ చేశారు. ఎమీ పాత్రతో చిట్టీ ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి ఆపరేషన్ ఏంటి? అన్నది తెరపై చూపించనున్నారని చిట్టీతో లేడీ రోబోట్ లవ్స్టోరి ఇంట్రెస్టింగ్గానే ఉంటుందని అర్థమవుతోంది.

తాజాగా `లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ రోబోట్స్` అంటూ కొత్త పోస్టర్ని రివీల్ చేసింది చిత్రబృందం. ఈ ఫోటోలో చిట్టీ-ఎమీ ప్రేమ జంట రొమాన్స్ ముచ్చటగొలుపుతోంది. ముఖ్యంగా ఈ రోబోట్లకు డిజైన్ చేసి డ్రెస్ స్టైలింగ్ ఫెంటాస్టిక్ అని ప్రశంసించి తీరాల్సిందే. ఇంటర్నేషనల్ అప్పీల్ ఈ రోబోట్ల లుక్లో కనిపిస్తోంది. లైకా అధినేత  సుభాష్ కరణ్ రాజీ లేకుండా పెట్టుబడులు సమకూర్చడం వల్లనే ఇది సాధ్యమైందని ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్ వల్ల మాత్రమే ఇలాంటి విజువల్స్ చూడగలమని ట్రైలర్ ఈవెంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. అదెంత నిజమో.. నవంబర్ 29న రిలీజ్ వేళ తేలనుంది.