దేశభక్తి టు ప్రాంతీయ శక్తి.. రాంబాబు రైటే..

Tue Apr 17 2018 11:07:07 GMT+0530 (IST)

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ ను.. తీసుకోవడం లేదు.. ఇలా చెబుతూ ఓ తెలుగు నటి తెలుగు టీవీ ఛానల్స్ లో తిరిగేస్తూ తెగ హంగామా చేస్తోంది. వ్యక్తిగత అన్యాయం అంటూ మొదలుపెట్టి.. మీడియాకు లీకులతో స్టార్ట్ చేసి.. ఇప్పుడు భావి తరాలకు అన్యాయం జరగకుండా ఉద్యమం చేస్తానంటోంది. ఇందులో భాగంగా ఓ స్టార్ హీరోని బూతులు తిట్టే వరకూ వచ్చేయడం అబ్బురపరిచే వ్యవహారమే.ఇప్పుడీమె చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే.. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ ను తీసుకోరు.. హిందీ హీరోయిన్స్ ను తెచ్చుకుంటారు కాబట్టి.. అక్కడకి పోయి సినిమాలు తీసుకోవాలట. అయినా.. ఓ సినిమాలో హీరోతో పాటు కొన్ని కీలక పాత్రలకు మాత్రమే ఆయా భాషల నటులు ఉంటారు. విలన్స్ ను ఇతర భాషల నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. కొత్తగా విలన్ గా క్రేజ్ వచ్చినా జగపతి బాబును సౌత్ అంతా ఆదరిస్తోంది కదా.. టెక్నీషియన్స్ ను ఇతర భాషల నుంచి తీసుకొస్తూ ఉంటారు. అనేక మంది ట్యాలెండెట్ సినిమాటోగ్రాఫర్స్ ఇలాగే టాలీవుడ్ కి వచ్చారు. మ్యూజిక్ కంపోజర్స్.. స్టంట్ మాస్టర్స్.. కూడా చూస్తుంటాం.

మేకప్ ఆర్టిస్టులను విదేశాల నుంచి తెచ్చుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు గ్రీన్ మ్యాట్ షూటింగులు మొదలయ్యాక దాదాపుగా అన్ని సినిమాల్లో గ్రాఫిక్స్ వాడకం తప్పనిసరి అయిపోయింది. దీనికి అయితే హాలీవుడ్ టెక్నాలజీనే అందరికీ కావాలి. అప్పుడెప్పుడూ గుర్తుకు రాని ప్రాంతీయ తత్వం హీరోయిన్ల దగ్గర మాత్రం చూపించాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యమే.

కెమేరామెన్ గంగతో రాంబాబు మూవీలో విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'మీకు తెలుగు తల్లి అంటే గౌరవం ఉందా.. తెలుగు తల్లిని ఎపుడైనా చూశారా.. అలా అయితే హిందీ తల్లి.. గుజరాతీ తల్లి.. మలయాళీ తల్లి.. వీళ్లందరి మీదా గౌరవం లేదా. ఇతర భాషల తల్లులను గౌరవించని నీకు.. జాతీయ గీతం పాడే అర్హత లేదు' అంటూ డైలాగ్ చెబుతాడు. సినిమాకు ఇది హైలైట్ సీన్.

సినిమా ఇండస్ట్రీకి ప్రాంతీయతత్వం అంటాగట్టాలనే ప్రయత్నం నిజంగా హాస్యాస్పదమే. సావిత్రి కాలం నుంచి హీరోయిన్లు ఇతర భాషల్లో నటించడం ఆనవాయితీనే. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతున్న ఈ నటీమణులు అంతా.. కోలీవుడ్ నుంచి కానీ.. బాలీవుడ్ నుంచి కానీ అవకాశం వస్తే ఎగిరిపోవడం లేదా.. వీళ్లు ఇక్కడ నుంచి అక్కడకి వెళ్తే ఎదుగుదల.. వాళ్లను అక్కడి నుంచి ఇక్కడకు తెస్తే అన్యాయం చేయడం.. బాగుంది కదూ వీళ్ల వరుస.

ఎంతమంది బాలీవుడ్ లోకి వచ్చినా.. అక్కడి భామలు భయపడరు.. ఎందుకంటే వారు నమ్ముకునేది వారి ట్యాలెంట్ ప్లస్ అందాన్ని మాత్రమే. అదే నమ్మకం ప్లస్ ఆత్మవిశ్వాసం వీళ్లకు ఉంటే.. దేశం మొత్తంలో ఎక్కడైనా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. అంతే తప్ప.. తెలుగు సినిమాలు తీసేవాళ్లంతా తెలుగువాళ్లనే తీసుకోవాలి అంటే.. అప్పుడు మన దగ్గర నుంచి బాహుబలి లాంటి చిత్రాలు వచ్చే అవకాశాలు ఉండవు కదా. తాము పడే కష్టానికి గుర్తింపు రావాలని వీళ్లు కోరుకున్నట్లు.. తాము పెట్టుబడి చేసే రూపాయికి తగినంత రాబడి ఉండాలని మూవీ మేకర్స్ అనుకోవడం తప్పు ఎలా అవుతుంది?