Begin typing your search above and press return to search.

బాక్సఆఫీసుకు వివాదం క్లాప్

By:  Tupaki Desk   |   24 Nov 2017 6:56 AM GMT
బాక్సఆఫీసుకు వివాదం క్లాప్
X
పద్మావతి. ఇది ఓ ప్రముఖ దర్శకుడి కళాతృష్ణకు ప్రతిరూపంగా నిలిచే చిత్రం. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో వివాదంగా తయారైంది. ఈ చిత్రం విడుదల అవుతుందో లేదో? విడుదలైనా థియేటర్లలో ప్రదర్శన కొనసాగనిస్తారో లేదో? ఆఖరికి లాభాలు ఆర్జిస్తుందా లేక నష్టాలు చవిచూస్తుందా? ఈ ప్రశ్నలు సర్వత్రా మెదలుతూనే ఉన్నాయి. ఈ చిత్రం భవిష్యత్తు ఏమిటో అర్థంకాకుండా ప్రశ్నార్థకంగా ఎంతకాలం మిగిలిపోతుంది? ఈ విధంగా హిందీ చిత్ర పరిశ్రమలో వివాదాలు అసహజమేమీ కాదు. కొత్త అంతకన్నా కాదు. గతంలోనూ, ఇప్పుడూ చిత్రాలు నిర్మాణా దశనుంచి విడుదల వరకూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. వివాదం తలెత్తితే లాభాలు ఆర్జించి నిర్మాతకు డబ్బూ - దర్శకునికి పేరుప్రఖ్యాతలు లభిస్తాయనే వాదన కూడా నిజం కాదు. హిందీ చిత్రసీమలో ఎన్నో చిత్రాలు వివాదానికి గురికాగా వాటిలో చాలా వరకు నష్టాలు చవిచూశాయి.

2008 నుంచి ఇప్పటివరకు 63 చిత్రాలు హిందీలో వివాదానికి గురికాగా అందులో 26 మాత్రమే లాభాలు ఆర్జించాయి. లేదా నష్టాలకు గురికాకుండా బయటపడ్డాయి. మిగిలినవన్నీ నష్టాలపాలై అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రముఖంగా చెప్పుకోదలిస్తే పీకే - భాజీరావ్ మస్తానీ - రైస్ - రామ్లీలా - ఏ దిల్హై ముష్కిల్ - సింగం - జోదా అక్బర్ - వేక్అప్ సిద్ - హిందూ సర్కార్ తదితర చిత్రాలన్నీ వివాదాస్పదమయ్యాయి. వాటిలో పీకే - భాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలు లాభాలు ఆర్జించగా, అత్యధిక సినిమాలు నష్టాలు చవిచూశాయి. రైస్ చిత్రాన్ని చత్తీస్ఘడ్ రాష్ట్రంలో నిషేధించారు. సింగం రిటర్న్స్ (అజయ దేవగణ్) చిత్రం 2011లో విడుదలై మధ్యలో నిలిపివేశారు. జోదా అక్బర్ రాజస్థాన్ రాష్ట్రంలో నిషేధానికి గురైంది. వేక్అప్ సిద్ 2009లో విడుదల కాగా మధ్యలోనే వివాదాస్పదమై ప్రదర్శనను నిలిపివేశారు.

2008 నుంచి ఇప్పటివరకు 63 చిత్రాలు వివాదాస్పదం కాగా, అందులో 19 చిత్రాలు మతప్రాతిపదికన తీవ్రస్థాయిలో వివాదమై హిందూ మతవాద సంస్థలు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది రాష్ల్రాల్లో ఆందోళనకు దిగాయి. మరో 19 చిత్రాలు రాజకీయ పరమైన వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా చారిత్రాత్మక అంశాల విషయంలో వివిధ వర్గాలు, కులాల మనోభావాలను కించపరిచే విధంగా వాటిని నిర్మించారని ఆందోళనలు సాగాయి.

2014లో పీకే చిత్రం ఘన విజయం సాధించింది. రూ.122 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.340 కోట్ల ఆదాయం సంపాదించి రికార్డుకెక్కింది. విశాల్ భరద్వాజ్ నిర్మించిన పీకే చిత్రంలోని పలు అంశాలపై వివాదం తలెత్తింది. తమిళ నటుడు సూర్య నిర్మించిన సింగం రిటర్న్స్ అన్ని భాషల్లోనూ విజయం సాధించగా. హిందీలోకి వచ్చేసరికి మతగురువుల విశ్వాసాలను కించపరిచారని వివాదం తలెత్తింది. ఈ సినిమా 2011లో రూ.41 కోట్లతో నిర్మించగా, రూ.98 కోట్లు సంపాదించిపెట్టింది. అయితే మధ్యలో చిత్ర ప్రదర్శనను నిలిపి వేయటంతో నిర్మాత మరింతగా లాభాలు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే షారూక్ ఖాన్ నటించిన మె నేమీస్ ఖాన్ చిత్రం విడుదలైన కొన్నాళ్లకు వివాదాలతో మధ్యలోనే ఆపివేశారు.

కరణ్ జోహార్ నిర్మించిన ఏ దిల్హై ముష్కిల్ చిత్రం కూడా అంతర్జాతీయ వివాదంలో పడిపోయింది. పాకిస్తాన్ కు చెందిన నటుడు ఫవాద్ ఖాన్ ఈ చిత్రంలో నటించటమే ప్రధాన కారణం. అదే సమయంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తీవ్రరూపం దాల్చింది. పాకిస్తాన్ అండదండలతో ఆ రాష్ట్రంలో ఉగ్రవాదులు విధ్వంసానికి ప్పాడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా హిందూ మతవాద సంస్థలు పాకిస్తానీ నటుడు నటించిన చిత్రాలను భారతదేశంలో అనుమతించబోమంటూ వివాదం సృష్టించడంతో ప్రదర్శనకు సమస్యలు ఎదురయ్యాయి. గత ఏడాది రూ.98 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.106 కోట్లు ఆర్జించినప్పటికీ వివాదాల కారణంగా అత్యధికంగా ప్రదర్శించలేకపోయారు.

గత ఏడాది సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన భాజీరావ్ మస్తానీ పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమూ ఒక అద్భుతం, ఒక కళాఖండంగా చెప్పవచ్చు. 2015లో రూ.143 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించాల్సి ఉండగా రూ.103 కోట్లతో బాక్సాఫీసు వద్ద ఆగిపోయింది. ఈ చిత్రంలో పేషవ్ భాజీరావ్, అతని భార్యకు సంబంధించి వాస్తవాలను వక్రీకరించారని హిందూ మతవాద సంస్థలు, కొన్ని వర్గాలు ఆందోళనకు దిగాయి.

ఏక్తా కపూర్ నిర్మించిన ఏహైదయాన్ చిత్రం కూడా వివాదానికి గురై నష్టాలపాయ్యింది. ఇటీవల మధుర్ భండార్కర్ నిర్మించిన ఎమర్జన్సీ నాటి రోజులకు సంబంధించిన చిత్రం కూడా వివాదాలతో నష్టాలు చవిచూసింది. 2008 నుంచి ఇప్పటి దాకా 54 చిత్రాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అందులో 2013లో 10 - 2014లో మరో 10 - 2015లో 12 చిత్రాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రా - కేంద్ర సెన్సార్ బోర్డు పరిశీలన అనంతరం అనుమతి లభించిన మీదటనే వివాదానికి గురికావటం ఆనవాయితీగా మారిపోయింది.

ప్రముఖ దర్శకుడు రాహుల్ షారూక్ నటునిగా నిర్మించిన రైయిస్ చిత్రం తీవ్ర వివాదానికి గురైంది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన మహీరా ఖాన్ ప్రముఖపాత్ర పోషించటమే. దీనిని మతవాద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించటంతో నాలుగు నెలలపాటు విడుదలకాకుండా ఆపివేయాల్సి వచ్చింది.

ప్రపంచంలో ఏదేశంలోనూ లేనివిధంగా భారతదేశంలో మాత్రమే చిత్రాలు తరచూ వివాదానికి గురవుతున్నాయి. ముఖ్యంగా మత - చారిత్రాత్మక అంశాల ఆధారంగా నిర్మించే చిత్రాలను కొన్ని వర్గాలు - అతిమతవాద సంస్థలు అడ్డుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర - గుజరాత్ - రాజస్థాన్ - ఉత్తరప్రదేశ్ - మధ్యప్రదేశ్ - ఉత్తరాఖండ్ - హర్యానా లాంటి రాష్ట్రాల్లో వివాదాలు అధికంగా ఉంటున్నాయి.



సంవత్సరం మొత్తం సినిమాలు వివాదాస్పదమైనవి
2017 116 5 (ఇప్పటి వరకు)
2016 139 2
2015 136 12
2014 139 10
2013 132 10
2012 132 5
2011 130 7
2010 157 7
2009 120 4
2008 144 1


సినిమా సంవత్సరం ఆందోళన ప్రభావం బడ్జెట్ - వసూళ్లు(కోట్లు)

రాయిస్ 2017 చత్తీస్ ఘఢ్ రాష్ట్రలో నిషేదం 127 - 128
ఏ దిల్ హై ముష్కిల్ 2016 - 98 - 106
బాజీరావ్ మస్తానీ 2015 143 -183
పికె 2014 - 122 -337
రాంలీలా 2013 - 88 -112
సింగం రిటర్న్స్ 2011 మధ్యలో ఆపేశారు 41- 98
వేక్అప్ సిద్ 2009 నిషేధం విధించారు 18-27
జోధా అక్బర్ 2008 రాజస్తాన్లో నిషేదం 55-56



----ఎస్ . వి. రావు