Begin typing your search above and press return to search.

ఓవ‌ర్సీస్‌ లో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` సీనెంత‌?

By:  Tupaki Desk   |   27 March 2019 5:48 AM GMT
ఓవ‌ర్సీస్‌ లో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` సీనెంత‌?
X
ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించిన మూడు సినిమాల గురించి ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎన్‌ బీకే త‌ల‌పెట్టిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్ప‌టికే రిలీజై ఫ‌లితం తేలిపోయింది. ఇక‌పై ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఫ‌లితం పైనా ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట సాగ‌నుంది. ఎన్టీఆర్ - క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు డిజాస్ట‌ర్లు గా నిల‌వ‌డంతో అన్న‌గారిపై బ‌యోపిక్ ప్ర‌య‌త్నం స‌రైన‌ది కాదు! అన్న అభిప్రాయం ఏర్ప‌డింది. నిజాల్ని చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే బాక్సాఫీస్ ఫ‌లితం రివ‌ర్స‌య్యింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 కోట్ల బిజినెస్ చేసిన ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు ఓవ‌ర్సీస్ లో 20 కోట్ల మేర బిజినెస్ చేశాయి. అయితే అన్నిచోట్లా నెగెటివ్ టాక్ రావ‌డంతో పూర్ క‌లెక్ష‌న్స్ తో అంతిమ ఫ‌లితం నివ్వెర‌ప‌రిచింది.

అందుకే ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఎలాంటి ఫ‌లితం అందుకోబోతోంది? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లోనూ చ‌క్క‌ని బిజినెస్ సాగింది. ఆర్జీవీ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ ప్రీరిలీజ్ బిజినెస్ కి పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుటైంద‌ని.. నిర్మాత‌ల‌కు 12 కోట్ల మేర టేబుల్ ప్రాఫిట్ మిగిలింద‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ సినిమాని ప్ర‌ముఖ పంపిణీ సంస్థ తెలుగు రాష్ట్రాల రిలీజ్ కోసం 9కోట్ల‌కు చేజిక్కించుకుంద‌ని, అలాగే ఓవ‌ర్సీస్ లో వీకెండ్ సినిమా సంస్థ భారీ మొత్తానికి రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. శాటిలైట్ డిజిట‌ల్ హ‌క్కుల రూపంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కి 3కోట్లు ద‌క్కింది. ఎంతో క్యాలిక్యులేటెడ్ గా ప‌రిమిత బ‌డ్జెట్ తో తెర‌కెక్కించి ప్ర‌చారార్భాటంతో హైప్ క్రియేట్ చేసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా ఆరంభ వ‌సూళ్ల‌తోనే సేఫ్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

తాజాగా తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలో ప్రీమియ‌ర్ల‌ గురించి అభిమానుల్లో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యుఎస్‌లో మార్చి 28 సాయంత్రం నుంచి ప్రీమియ‌ర్ షోల‌ సంద‌డి నెల‌కొన‌నుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేట‌ర్ల‌లో ప్రివ్యూలు వేసే వీలుంద‌ని తెలుస్తోంది. కేవ‌లం ఒక్క‌ అమెరికాలో దాదాపు 125 పైగా లొకేష‌న్ల‌లో వీకెండ్ సినిమా సంస్థ రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ``ఇది కుటుంబ కుట్ర‌ల క‌థ‌. ఇదీ అస‌లైన ఎన్టీఆర్ క‌థ`` అంటూ ఆర్జీవీ చేసిన ప్ర‌మోష‌న్ ఓవ‌ర్సీస్ లోనూ పెద్ద రేంజులో వ‌ర్క‌వుట్ కానుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ హుషారులోనే `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` అమెరికా నుంచి మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లు సాధిస్తుందా? అన్న ఆస‌క్తి నెల‌కొంది.