Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోతుందా?

By:  Tupaki Desk   |   27 Aug 2015 4:12 PM GMT
ఈ దెబ్బతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోతుందా?
X
అందాల రాక్షసి లాంటి క్లాస్ సినిమాతో అరంగేట్రం చేసింది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. లావణ్యకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన ఆమె అందానికి, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. చాలామంది కుర్రాళ్లు ఆమె ప్రేమలో పడిపోయారు. ఐతే తొలి సినిమా మంచి పేరైతే తెచ్చిపెట్టింది కానీ.. పెద్దగా అవకాశాలు ఇప్పించలేదు. ఒక్క మంచు విష్ణు మాత్రమే తన ‘దూసుకెళ్తా’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్టయినా కూడా లావణ్య కెరీర్ ఊపందుకోలేదు. దీంతో అమ్మడు తిరుగు టపాలో నార్త్ కు వెళ్లిపోతుందేమో అనుకున్నారంతా. కానీ కొంచెం లేటైనా లావణ్య కెరీర్ ఇప్పుడు బాగానే ఊపందుకుంటోంది.

ఓవైపు నాగార్జున లాంటి స్టార్ హీరోతో ‘సోగ్గాడె చిన్నినాయనా’లో నటిస్తున్న లావణ్య.. నాని సరసన ‘భలే భలే మగాడివోయ్’లోనూ హీరోయిన్ గా చేసింది. మరోవైపు తన తొలి సినిమా హీరో నవీన్ చంద్రతో కలిసి ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే సినిమాలోనూ చేస్తోంది లావణ్య. ఈ మూడు సినిమాలు వేటికవే భిన్నమైనవి. ఆసక్తి రేపుతున్నవి. వీటిలో ముందుగా ‘భలే భలే మగాడివోయ్’ సెప్టెంబరు 4న రిలీజవబోతోంది. ప్రోమోస్, ట్రైలర్ అన్నీ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. మారుతి రూపొందించిన ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందన్న అంచనాలున్నాయి. సోగ్గాడె చిన్నినాయనా, లచ్చిందేవికి ఓ లెక్కుంది కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి కూడా ఆడాయంటే ఈ ఏడాది ఆఖరుకు లావణ్య టాప్ లీగ్ లోకి చేరిపోవడం ఖాయం. అందుకే రాబోయే నాలుగు నెలలు లావణ్యకు చాలా కీలకం.