Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ:‘లంక’

By:  Tupaki Desk   |   21 April 2017 10:21 AM GMT
మూవీ రివ్యూ:‘లంక’
X
చిత్రం : ‘లంక’

నటీనటులు: రాశి - సాయి రోనక్ - ఐనా సాహా - సిజ్జు - సుప్రీత్ - గిరిబాబు - సత్య - సుదర్శన్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: రవికుమార్
నిర్మాతలు: దినేష్ నామన - విష్ణుకుమార్ నామన
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీ ముని

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. ఆపై పెళ్లి చేసుకుని సెటిలైపోయిన రాశి.. ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ తో పునరాగమనం చేసింది. ఐతే వాటి వల్ల రాశికి అంత పేరేమీ రాలేదు. ఇప్పుడు ఆమే ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా ‘లంక’. ట్రైలర్ చూస్తే ఇదేదో డిఫరెంట్ సినిమాలా కనిపించింది. మరి ఈ ‘లంక’లోని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

స్వాతి (ఐనా సాహా) మలయాళంలో ఒక స్టార్ హీరోయిన్. ఆమె ఓ సినిమా షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తుంది. షూటింగ్ ముగిసినప్పటికీ ఓ సమస్య కారణంగా ఆమె ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఓ షార్ట్ ఫిలిం చేయడానికి ఒప్పుకుంటుంది స్వాతి. ఆ షూటింగ్ కోసం ఊరవతల ఉండే గెస్ట్ హౌస్ కు వెళ్లగా.. అందులో ఒంటరిగా ఉండే రెబెక్కా (రాశి)ను చూసి స్వాతి భయపడుతుంది. కొన్ని రోజులు గడిచాక స్వాతి ఉన్నట్లుండి కనిపించకుండా పోతుంది. అందరూ రెబెక్కానే అందుకు కారణం అనుకుంటారు. మరి నిజంగా రెబెక్కానే స్వాతిని మాయం చేసిందా.. ఆమె గతమేంటి.. స్వాతికి ఎదురైన సమస్య ఏంటి.. చివరికి స్వాతి క్షేమంగా బయటపడిందా.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త కథతో.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింతో తన అరంగేట్రం జరగాలని కోరుకోవడం అభినందనీయ విషయమే. కానీ ఆ కొత్త కథను కన్విన్సింగ్ గా.. ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం అత్యంత కీలకమైన విషయం. లేదంటే అసలుకే మోసం వచ్చేస్తుంది. ‘లంక’ దర్శకుడు శ్రీ ముని ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. టెలీపతి అంటూ ఓ కొత్త కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ కథను రాయాలనుకోవడం ఓకే. కానీ తన ఆలోచనల్ని పేపర్ మీద పెట్టేటపుడే అతడికి క్లారిటీ లేదేమో అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. థియేటర్లో ఉన్నంతసేపే కాదు.. బయటికి వచ్చాక కూడా ఈ దర్శకుడు అసలేం చెప్పదలుచుకున్నాడు అన్న సందేహాలు ప్రేక్షకుల్ని వేధిస్తాయంటే ఈ సినిమా ఎంత గందరగోళంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

‘లంక’లో దర్శకుడు చర్చించదలిచిన కొత్త అంశం.. టెలీపతి. దీని గురించి సైన్స్ ఏం చెబుతోందో కానీ.. తనకు దూరమైన వ్యక్తుల్ని ఉన్నట్లుగా ఊహించుకుంటూ.. వారితోనే గడుపుతున్నట్లు భావిస్తూ జీవనాన్ని సాగించడం.. ఎక్కడో ఉన్న వ్యక్తులతో కూడా మానసికంగా కనెక్టవడం.. ఇలా ‘టెలీపతి’ గురించి ఏదో చెప్పాడు దర్శకుడు. ఐతే కథకు కీలకమైన ఈ కాన్సెప్టును దర్శకుడు డీల్ చేసిన తీరు చాలా గందరగోళంగా సాగుతుంది. సినిమా ఆరంభం.. ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్స్ ఎంత అనాసక్తికరంగా.. బోరింగ్ గా ఉన్నప్పటికీ.. ఒకసారి టెలీపతి కాన్సెప్ట్ చుట్టూ కథ నడవడం మొదలయ్యాక ప్రేక్షకులకు కొంత ఆసక్తి కలుగుతుంది. కానీ ఆ ఆసక్తి కాసేపటికే నీరుగారిపోయేలా చేశాడు దర్శకుడు. ఈ కాన్సెప్ట్ ను కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. పైగా ఒక సన్నివేశానికి.. ఇంకో సన్నివేశానికి సంబంధం లేనట్లుగా.. తెర మీద ఏం జరుగుతోందో అర్థం కానట్లుగా కథనం పూర్తి గందరగోళంగా.. నడవడంతో నెమ్మదిగా ఈ కథ నుంచి డీవియేట్ అయిపోతాం.

పైగా ఈ కథంతా నడుస్తుండగా.. ‘డార్లింగ్’ లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూ.. ఇప్పటిదాకా మీరు చూసిందంతా ట్రాష్ అంటూ తేల్చేపడేశాడు దర్శకుడు. సినిమాకు ఏ కాన్సెప్ట్ అయితే కీలకం అనుకున్నాడో దాని విషయంలోనే తూచ్ అనేయడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. చివర్లో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే విలన్ ఆట కట్టించే వ్యవహారం అంతా రొటీనే. కథలోని సస్పెన్స్ ఏంటో తెలుసుకోవడానికి చివరి దాకా ఎదురు చూస్తాం కానీ.. అప్పటికే ఓపిక నశించి పోతుంది. సస్పెన్స్ రివీల్ చేసిన తీరు కన్విన్సింగ్ గా అనిపించదు. చివరికి గందరగోళంతో.. అయోమయంతో.. అనేక ప్రశ్నలతో సినిమా నుంచి బయటికి వస్తాం. గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి మారడం.. కొత్తదనం కోరుకుంటుండటం వాస్తవమే. కానీ కొత్తదనం పేరుతో మరీ ఈ స్థాయిలో కన్ఫ్యూజ్ చేస్తే.. ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం కథను నడిపిస్తే.. దీని కంటే రొటీన్ సినిమాలే మేలు అన్న భావన కలుగుతుంది.

నటీనటులు:

సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ రాశి నటనే. రెబెక్కా పాత్రలో ఆమె బాగా నటించింది. కానీ షేపవుట్ అయిపోయి.. డీగ్లామరస్ గా కనిపించే రాశిని చూడటం ఆమె అభిమానులకు కష్టమే. సినిమాలో ఒక చోట హీరోయిన్ అన్నట్లు ఆమెను చూస్తేనే భయమేస్తుంది. కథ కోణంలో కాకుండా మామూలుగా కూడా రాశి అంతలా భయపెట్టేసింది. సిజ్జు కూడా బాగా చేశాడు. హీరో హీరోయిన్లు ఏమంత ప్రత్యేకత చూపించలేకపోయారు. సాయి రోనక్ చూడ్డానికి బావున్నాడు. కానీ నటన పరంగా అతను చేయడానికేమీ లేకపోయింది. హీరోయిన్ ఐనా సాహా ఏ రకంగానూ మెప్పించలేకపోయింది. ఆమెలో హీరోయిన్ లక్షణాలు లేవు. నటనా అంతంతమాత్రమే. సుప్రీత్.. సత్యం రాజేష్.. సత్య.. సుదర్శన్.. వీళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

‘లంక’ లాంటి సినిమాలకు నేపథ్య సంగీతం కీలకం. ఐతే ఈ సినిమా రకరకాలుగా సాగడంతో దీనికి ఎలాంటి నేపథ్య సంగీతం ఇవ్వాలో తెలియని కన్ఫ్యూజన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ లో ఏర్పడినట్లుంది. హార్రర్ థ్రిల్లర్లలో రెగులర్ గా వినిపించే కొన్ని శబ్దాలకు తోడు.. కొన్ని చోట్ల కొత్తగా ఏదో ట్రై చేశాడు. ఐతే చాలా చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా అనిపిస్తుంది. ఇక ఇందులో ఉన్న ఒకట్రెండు పాటల గురించైతే చెప్పాల్సిన పని లేదు. రవికుమార్ ఛాయాగ్రహణం పర్వాలేదు. రాశి మినహా చెప్పుకోదగ్గ కాస్టింగ్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో కొంచెం క్వాలిటీతోనే సినిమాను తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక దర్శకుడు శ్రీ ముని విషయానికొస్తే.. అతనేదో కొత్తగా చెప్పాలని చూశాడు కానీ.. అతడి అనుభవ లేమి స్పష్టంగా తెరమీద కనిపించింది. ఏదేదో చెప్పాలని.. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేయాలని.. సర్ప్రైజ్ చేయాలన్న తాపత్రయంలో సినిమాను చాలా గందరగోళంగా.. అర్థం కాని విధంగా తయారు చేశాడు. ఒక తీరుగా కథను చెప్పడం అతడి వల్ల కాలేదు. అడుగడుగునా డీవియేషన్.. అనాసక్తికరమైన నరేషన్ వల్ల సినిమా ఎక్కడా కుదురుగా సాగలేదు. కాన్సెప్ట్ వరకు ఓకే కానీ.. అంతకుమించి ఏమీ లేదు ‘లంక’లో.

చివరగా: ఇది అయోమయ ‘లంక’

రేటింగ్-1.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre