Begin typing your search above and press return to search.

వ‌ర్క్ ప్లేస్ లో వేధిస్తే తోలు తీస్తార‌ట‌

By:  Tupaki Desk   |   26 May 2019 8:26 AM GMT
వ‌ర్క్ ప్లేస్ లో వేధిస్తే తోలు తీస్తార‌ట‌
X
మంచు డాట‌ర్ మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఆల్ రౌండ‌ర్ ప్ర‌తిభ గురించి తెలిసిందే. న‌టి.. యాంక‌ర్.. నిర్మాత‌.. ఇలా అన్ని కోణాల్లోనూ నిరూపంచుకున్నారు. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఉమెన్ (VoW!) పేరుతో మ‌రింత పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. వావ్ లోనే ఉమెన్ ఇన్ సినిమా క‌లెక్టివ్ (WCC) పేరుతో యాక్టివిటీస్ కి ల‌క్ష్మీ మంచు తెర తీశారు. ప‌ని చేసే చోట ఆడ‌వారిపై వేధింపుల్ని స‌హించేది లేద‌ని ఇటీవ‌లే వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మీటూ ఉద్య‌మానికి అండ‌గా మంచు ల‌క్ష్మీ సార‌థ్యంలో ఓ క‌మిటీ ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. ఇందులో నిర్మాత‌ సుప్రియ యార్ల‌గ‌డ్డ‌- యాంక‌ర్ ఝాన్సీ- యాంక‌ర్ సుమ క‌న‌కాల‌- నిర్మాత‌ స్వ‌ప్న ద‌త్ - ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి వంటి ప్ర‌ముఖులు ఉన్నారు. వీళ్లంతా ఓ క‌మిటీగా ఏర్ప‌డి వేధింపుల‌పై రివ్యూలు చేస్తున్నారు. అందుకోసం ఆన్ లైన్ ఫిర్యాదు స‌దుపాయంతో పాటు ఆన్ లొకేష‌న్ ఫిర్యాదుల కోసం ఒక బాక్స్ ని ఏర్పాటు చేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక‌పోతే ఇంత‌కాలం వ్వావ్ క‌మిటీ సేవ‌లు కేవ‌లం టాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ గ్రూప్ అటు బాలీవుడ్ స‌హా ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌న్నిటికీ విస్త‌రించే ఆలోచ‌న‌లో ఉంద‌ని తెలిసింది. అంటే అటు ఉత్త‌రాది సినీప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు... ఇటు ద‌క్షిణాది సినీప‌రిశ్ర‌మ‌ల్లో ఈ క‌మిటీ యాక్టివ్ గా కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్ట‌నుంది. దేశ‌వ్యాప్తంగా వేధింపులు ఎక్క‌డ జ‌రుగుతున్నా అక్క‌డ వీళ్లు వాలిపోతారు. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తారు. ఆ మేర‌కు న‌టీమ‌ణుల‌కు ఒక గొప్ప భ‌రోసా క‌లుగ‌నుంద‌న్న ముచ్చ‌ట టాలీవుడ్ లో సాగుతోంది.

ఇంత‌కీ ఈ బృందానికి అన్ని ప‌రిశ్ర‌మ‌ల నుంచి స‌పోర్ట్ ఉంటుందా? అంటే ప్ర‌స్తుతానికి చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ట‌. ముఖ్యంగా నిర్మాత‌ల మండ‌లి- ద‌ర్శ‌క‌సంఘం- ఆర్టిస్టుల సంఘం- ర‌చ‌యిత‌ల సంఘం త‌దిత‌ర సంఘాల నుంచి మ‌ద్ధ‌తును కూడ‌గ‌డుతున్నారు. టాలీవుడ్ వ‌ర‌కూ వీళ్లంతా ఇప్ప‌టికే స‌పోర్టును అందిస్తున్నారు. ఆరుగురు మ‌హిళ‌ల‌తో ఏర్ప‌డిన ఈ క‌మిటీకి ప్ర‌తిచోటా వ‌లంటీర్లు సాయం చేయ‌బోతున్నార‌ట‌. ``మీ క‌థ‌ల్ని చెప్పంది. అన్యాయాల్ని వివ‌రించండి. ఓపెన్ అవ్వండి. స‌మ‌స్య ఏదైనా మాకు రాయండి. బ‌య‌టికి చెబితే ఎన్నో మ్యాజిక‌ల్ థింగ్స్ కి ఆస్కారం ఉంది. ఒక‌రి వెంట ఒక‌రుగా వాయిస్ వినిపించేందుకు వీలుంది. మీటూ పేరుతో అంద‌రం ఒకే వేదిక‌పైకి చేర‌దాం. ఎప్ప‌టికీ మీరు ఒంట‌రి కాబోరు`` అంటూ ఓ స్లోగ‌న్ ని వ్వావ్ బృందం ముందుకు తీసుకెళుతోంది. ఇక వ్వావ్ బృందం గ‌త కొంత‌కాలంగా సైలెంట్ గా ఉండ‌డంతో అస‌లేం జ‌రుగుతోందో? అంటూ సందేహం వ్య‌క్త‌మైంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హిళా శ‌క్తి మ‌రింత శ‌క్తివంతంగా మారుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది ప‌రిశ్ర‌మ‌లో మ‌గువ‌లకు శ్రీ‌రామ‌ర‌క్ష అనే చెప్పాలి. ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందించి తీరాలి.