ఫ్యామిలీ విషయాలపై ఓపెన్ అయిన కుష్బూ!

Tue Dec 11 2018 07:00:01 GMT+0530 (IST)

మీకెందుకండి మా వ్యక్తిగత వివరాలు.. అంటూ ఆగ్రహంగా మాట్లాడటం చాలామంది సెలబ్రిటీలకు అలవాటు. దీనికి భిన్నంగా తమకు సంబంధించిన వివరాల్ని.. సున్నితమైన అంశాల్ని ఓపెన్ గా చెప్పేసే ప్రముఖులు ఉంటారు. చాలామందికి తెలీదు.. మా ఫ్యామిలీ విషయాలివి అని చెప్పేటోళ్లు ఉన్నారు.అలా ఓపెన్ కావటానికి చాలా దమ్ము.. ధైర్యం కావాలి. రాజకీయాలు అన్న వెంటనే రకరకాల కాంబినేషన్లు ఉంటాయి. కొన్నిసార్లు బయటకు చెప్పే విషయాల కారణంగా కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ.. వాటిని పట్టించుకోకుండా.. మీరు అడగాలే కానీ దాచి పెట్టుకోకుండా అన్ని చెబుతానన్న రీతిలో కొందరు సినీ ప్రముఖులు మాట్లాడుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు సినీ.. రాజకీయ ప్రముఖురాలు..కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కుష్బూ. పేరు చూస్తే హిందువులా కనిపించినా ఆమె ముస్లిం అంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థులు ఆమెను ఆడిపోసుకుంటారు. కానీ.. ఆమెను.. మీరు హిందువా?  ముస్లిమా? అని అడిగితే అసలు విషయాల్ని చెబుతారు.

బీజేపీ నేతలు తనను టార్గెట్ చేస్తుంటారని.. తన మతాన్ని వేలెత్తి చూపిస్తారని.. కానీ వారికి తెలీని తన ఫ్యామిలీ విషయాల్ని తాను వెల్లడిస్తానంటూ చిట్టా చదివినట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కుటుంబం.. తన సోదరుల వ్యక్తిగత విషయాల్ని ఆమె ప్రస్తావించారు. ఇంతకీ ఆమె చెప్పిన విషయాలేమిటన్నది చూస్తే.. ఆమె కుటుంబం మినీ భారత్‌ను తలపిస్తుందని చెప్పక తప్పదు.

తన పేరు నఖత్ ఖాన్ అని.. అలియాస్ కుష్బూ సుందర్ గా చెప్పిన ఆమె.. తనను ఉద్దేశించి బీజేపీ వాళ్లు అదే పనిగా తప్పుడు ప్రచారాలు చేస్తుంటారన్నారు. తాను ఐసిస్ ఏజెంట్‌నని.. పాక్ నుంచి వచ్చినట్లు చెబుతారు కానీ.. తమ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ ఫ్యామిలీగా చెప్పారు. తాను మరికొన్ని కొత్త విషయాల్ని బీజేపీ చెప్పాలనుకుంటున్న చెబుతూ.. తన కుటుంబ వివరాల్ని వెల్లడించారు.

తన పెద్దన్న ముస్లింను పెళ్లి చేసుకున్నారని.. రెండో అన్న ఇండోనేషియన్ క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. చివరి బ్రదర్ మలయాళీ క్రిస్టియన్ ను వివాహం చేసుకున్నారని.. తాను హిందువును పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పారు. తన ఇంటికి వస్తే గేటు నుంచి లోపలకు రాగానే వినాయకుని బొమ్మలే కనిపిస్తాయన్నారు. ఇన్ని విషయాల్ని కుష్బూనే చెప్పాక.. బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.