ఏ నిర్మాత ఒక్క రాత్రి కోసం కోట్లు ఖర్చు పెట్టడు

Mon Dec 10 2018 10:38:04 GMT+0530 (IST)

ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం అందరికి సాధ్యం కాదు. అందుకు చాలా ధైర్యం కావాలి. అలాంటి తత్త్వం టన్నుల లెక్కన ఒక మహిళా నటికి ఉండటం సాధ్యమేనా? అంటే నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి సమాధానం చెప్పేటప్పుడు కుష్భులాంటోళ్లు ఉంటారన్న విషయాన్ని మర్చిపోకూడదు.సినిమా పరిశ్రమలో మొహమాట పరదాలు చాలా బలంగా ఉన్న రోజుల్లోనే మొహమాటం లేకుండా తన మనసుకు నచ్చినట్లుగా మాట్లాడిన గట్స్ కుష్బూ సొంతం. తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

ఎనిమిదేళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చిన తనకిప్పుడు 48 ఏళ్లు అని.. తాను తెలుగు.. తమిళం.. కన్నడం.. హిందీ భాషల్లో సినిమాలు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ తనకు ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురు కాలేదని చెప్పారు.  ఇండస్ట్రీలో ఎవరూ ఇన్ డీసెంట్ గా ప్రపోజల్ చేయలేదన్నారు.

వెంకటేశ్ హీరోగా నటించిన కలియుగ పాండవుల మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక అనుభవాన్ని వెల్లడించారు. ఆ సినిమా క్లైమాక్స్ షూట్ ఒక గ్రామంలో జరుగుతోందని.. గవర్నమెంట్ హాస్టల్ లో మెట్లు ఎక్కి వెళుతుంటే ఒకడు రాంగ్ గా టచ్ చేశాడని.. ఆ వెంటనే చెంప పగలగొట్టినట్లుగా చెప్పారు. దీంతో.. గ్రామానికి చెందిన వారు వచ్చారని.. ఆ టైంలో వెంకటేశ్.. రామానాయుడు సపోర్ట్ గా నిలబడ్డారన్నారు.

అందరూ అనుకున్నట్లుగా ఏ నిర్మాత కూడా ఒక్క రాత్రి కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టడన్న కుష్బూ.. సినిమా తీసే ఆలోచనలు లేని వారే.. నిర్మాత పేరుతో అలాంటి పనులు చేస్తుంటారని క్లారిటీ ఇచ్చారు. ఇంత ఓపెన్ గా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పటం కుష్బూ లాంటోళ్లకు తప్ప మామూలోళ్లకు సాధ్యం కాదేమో?